కూతురిని చాలా మిస్సవుతున్న బన్నీ

స్టైలిష్‌ స్టార్‌​ అల్లు అర్జున్‌కు తన గారాలపట్టి అర్హ అంటే వల్లమాలిన ప్రేమ. ఆమెతో కాసేపు ఆడుకుంటే చాలు తన ఒత్తిడినంతా మర్చిపోతాడు. లాక్‌డౌన్‌లో బోలెడంత సమయం దొరకడంతో ఈ తండ్రీకూతుర్లు ఆటపాటలతో హాయిగా గడిపారు. కానీ ఇప్పుడు బన్నీ షూటింగ్స్‌తో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం సుకుమార్‌తో పుష్ప చేస్తుండగా తర్వాత కొరటాల శివతో మరో సినిమా చేయనున్నాడు.

ఇక ‘పుష్ప’ ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సాగే కథ కావడంతో షూటింగ్‌ కోసం యూనిట్‌ అంతా అడవుల్లో పాగా వేసింది. ఈ క్రమంలో బన్నీ అర్హను చాలా మిస్సవుతున్నాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో అర్హ వీడియోను షేర్‌ చేస్తూ “ఐ మిస్‌ యూ అర్హ” అని రాసుకొచ్చాడు. ఇందులో అల్లరి అర్హ “బెండకాయ, దొండకాయ, నువ్వు నా గుండె కాయ” అని ముద్దుముద్దుగా మాట్లాడటంతో చివర్లో బన్నీ తెగ నవ్వేశాడు.

కాగా ‘ఆర్య’, ‘ఆర్య 2’ వంటి సూపర్‌ హిట్‌ చిత్రాల తర్వాత సుకుమార్‌-అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా పుష్ప. రష్మిక మందన్నా కథాయికగా నటిస్తోంది. ఇందులో హీరోహీరోయిన్లిద్దరూ చిత్తూరు యాసలో ఇరగదీయనున్నారట. పైగా పుష్పరాజ్‌ అలియాస్‌ బన్నీ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్నారు. ఆగస్టు 13న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.