అల్లు అర్జున్‌ సినిమా లో బాలీవుడ్‌ భామ

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా క్రియోటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో ‘పుష్పా’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ షెడ్యూల్‌ను జరుపుకుంటోంది. ఈ మూవీ తర్వాత బన్నీ కొరటాల శివ డైరెక్షన్‌లో వచ్చే ఓ సినిమాలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో బన్నీకి జోడీగా బాలీవుడ్‌ భామ సయూ మంజ్రేకర్‌ను అనుకుంటున్నట్లుగా టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. కండల వీరుడు ‘దబాంగ్ 3’ చిత్రంలో హీరోయిన్‌గా సయూ బాలీవుడ్‌లో అరంగేట్రం చేసింది. ప్రస్తుతం ఆమె అడవి శేష్‌ హీరోగా వస్తున్న ‘మేజర్’‌ సినిమాలో నటిస్తోంది.

కాగా మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోన్న ‘పుష్పా’ చిత్రంలో బన్నీ సరసన రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాపై డైరెక్టర్‌ సుక్కు స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్‌ తొలిసారిగా పూర్తిస్థాయిలో మాస్‌ రోల్‌లో కనిపించనున్నాడు. కరోనా నేపథ్యంలో పలుమార్లు వాయిదా పడిన మూవీ షూటింగ్‌.. ప్రస్తుతం పరిస్థితులు సాధారణ స్థితికి రావడంతో తిరిగి సెట్స్‌పైకి వచ్చింది. ఈసారి పక్కా షెడ్యూల్ రెడీ చేసి త్వరగా సినిమాను పూర్తి చేయాలని చిత్ర బృందం కసరత్తులు చేస్తోంది.