విడాకులు వ‌ద్దు..నా భర్తే ముద్దు

ఇండియాలో ఉన్న మోస్ట్ వర్సటైల్ యాక్టర్స్ లో న‌వాజుద్దీన్ సిద్ధిఖీ కూడా ఉంటాడు. ఈయన సినిమాల్లో ఎంత అద్భుతంగా నటిస్తాడో.. రియల్ లైఫ్ లో అన్ని వివాదాల్లో ఇరుక్కుంటాడు. మరీ ముఖ్యంగా చాలా ఏళ్ళుగా ఈయనపై భార్య అలియా చేస్తున్న ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. కొన్నేళ్లుగా ఈయనతో విడాకుల కోసం ఆమె ప్రయత్నిస్తుంది. అతడితో కలిసి జీవించబోయేది లేదంటూ చాలా సార్లు తేల్చి చెప్పింది కూడా. 2009లో అలియాని రెండో పెళ్లి చేసుకున్నాడు నవాజుద్దీన్. ఈ జంటకు ఇద్ద‌రు పిల్లలు కూడా ఉన్నారు. తమకు ఏ మాత్రం న‌వాజుద్దీన్ పట్టించుకోవడం లేదని.. అసలు ధ్యాసే ఉండదంటూ చాలాసార్లు ఆరోపించింది అలియా. అంతేకాదు ఈయనపై రేప్ కేసుతో పాటు మానసికంగా వేధించాడంటూ కేసు కూడా ఫైల్ చేసింది. ముంబైలోని వెర్సోవా పోలీస్ స్టేషన్‌లో అలియా కేసు ఫైల్ చేయ‌గా,  పోలీసులు  ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని విచారణ మొదలు పెట్టారు. ఆ మధ్య కొన్ని రోజులు కనిపించకుండా పోయాడు ఈయన. బయటికి వచ్చిన తర్వాత తన భార్య చేసిన వ్యాఖ్యలను కొట్టి పారేసాడు  . అంతేకాదు తన తరఫు న్యాయవాదితో ఈ లీగల్ నోటీసుపై వివరణ ఇప్పించాడు. తాను నెల నెలా భార్యా పిల్లలకు భత్యం చెల్లిస్తున్నట్లు చెప్పాడు నవాజుద్ధీన్. పిల్ల‌లకి సంబంధించిన ఖ‌ర్చుల‌తో పాటు భార్యకు కూడా నష్టపరిహారం చెల్లిస్తున్నట్లు తెలిపాడు. అయినా కూడా తనను కావాలనే ఇబ్బంది పెడుతుందని.. తన పరువు తీస్తుందంటూ సీరియస్ అయ్యాడు నవాజుద్ధీన్. అయితే ఎన్నో మలుపులు తిరిగిన తర్వాత తాజాగా ఈ కేసు సుఖాంతం అయింది. తనకు విడాకులు వద్దంటూ చెప్పింది అలియా. తనకు మొగుడే కావాలని, ఆయ‌న‌తోనే ఉంటానంటుంది అలియా . భర్తతో ఇప్పటి వరకు తనకు ఉన్న సమస్యలు మరిచిపోయి కలిసి బతకడానికి నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చింది. కొన్ని రోజులుగా ఈమె కరోనాతో బాధ పడుతుంది. దాంతో ముంబైలోని తన ఇంట్లోనే ఉండిపోయింది. మరోవైపు లక్నోలో షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు నవాజుద్దీన్. ఇలాంటి క్లిష్ట సమయంలోనూ అంత బిజీగా ఉన్న తన ఇద్దరు పిల్లలను నవాజ్.. కంటికి రెప్పలా చూసుకుంటున్నాడని.. ప్రతీరోజూ తనకు కూడా ఫోన్ చేసి ఆరోగ్యంపై ఆరా తీస్తున్నాడని చెప్పుకొచ్చింది అలియా. తను నవాజుద్ధీన్ లో కోరుకున్న మార్పు కూడా ఇదే అని చెప్పింది. తనకు కావాల్సినట్లు ఉన్నాడని.. అందుకే విడాకుల నోటీసులు కూడా వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఇకపై కొత్త జీవితం మొదలు పెట్టబోతున్నట్లు చెప్పుకొచ్చింది అలియా సిద్ధిఖీ.