దర్శకుడిని ప్రేమిస్తున్న అను ఇమ్మాన్యుయేల్‌

తెర మీద హీరోహీరోయిన్లు ప్రేమించుకుంటారు. తెర వెనుక కూడా చాలామంది హీరోహీరోయిన్లు ప్రేమలో పడతారు. అయితే కొన్నిసార్లు దర్శకులు హీరోయిన్లు కూడా ప్రేమపాఠాలు చెప్పుకుంటారు. తాజాగా టాలీవుడ్‌ హీరోయిన్‌ అను ఇమ్మాన్యుయేల్‌ ఓ దర్శకుడితో పీకల్లోతు ప్రేమలో మునిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఆమె 2017లో నటించిన ‘ఆక్సిజన్’‌ సినిమా దర్శకుడు జ్యోతి కృష్ణతో డేటింగ్‌లో ఉన్నట్లు టాక్‌ వినిపిస్తోంది. ఆ సినిమా షూటింగ్‌ సమయంలోనే వీరిద్దరి మధ్య చిగురించిన స్నేహం ప్రేమగా మారిందని అంటున్నారు. ఇక ఈ వార్తలపై అను ఇమ్మాన్యుయేల్‌ కానీ, జ్యోతి కృష్ణ కానీ ఇంతవరకు స్పందించనేలేదు. కాగా ప్రముఖ నిర్మాత ఏఎమ్‌ రత్నం కుమారుడే ఈ జ్యోతి కృష్ణ.

అను ఇమ్మాన్యుయేల్‌ కెరీర్‌ విషయానికి వస్తే.. ‘యాక్షన్‌ హీరో బైజు’ చిత్రంతో హీరోయిన్‌గా అడుగు పెట్టిందీ బ్యూటీ‌. ఇది మలయాళ సినిమా అయినప్పటికీ అనుకు ఆఫర్లు వచ్చింది మాత్రం తెలుగులోనే. అలా టాలీవుడ్‌లో తొలి చిత్రం ‘మజ్ను’లో నాని సరసన నటించి మంచి మార్కులు కొట్టేసింది. కానీ ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలు పెద్దగా హిట్టవ్వలేదు.

ఇక ‘శైలజా రెడ్డి’ అల్లుడు తర్వాత ఇక్కడ పూర్తిగా స్లో అయిన అను ఈ మధ్యే బెల్లంకొండ శ్రీనివాస్‌ సరసన ‘అల్లుడు అదుర్స్‌’లో నటించింది. కానీ అది కూడా బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా కొట్టింది. కోలీవుడ్‌లోనూ రెండు, మూడు సినిమాల్లో తళుక్కుమని మెరిసింది. ప్రస్తుతం ఈ అమ్మడు శర్వానంద్‌, సిద్దార్థ్‌ కలిసి నటిస్తున్న ‘మహాసముద్రం’లో ఓ హీరోయిన్‌గా నటిస్తోంది. దీనికి ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ అజయ్‌ భూపతి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇంటెన్స్‌ లవ్‌ అండ్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆమెకు ఏమేరకు విజయాన్ని అందిస్తుందో చూడాలి!