ఉప్పెన చిత్రంపై అల్లు అర్జున్‌ ప్రశంసలు

వైష్ణవ్‌ తేజ్‌, కృతి శెట్టి నటించిన ఉప్పెన చిత్రంపై టాలీవుడ్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ప్రశంసలు కురిపించారు. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఉప్పెన చిత్రం ఫిబ్రవరి 12న థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఇన్ని రోజులు షూటింగ్‌లతో బిజీగా ఉన్న బన్నీ ఆలస్యంగా ఉప్పెన సినిమాను చూశారు. ఈ సందర్భంగా మూవీపై తన అభిప్రాయాన్ని ట్విటర్‌ వేదికగా పంచుకున్నాడు. ఇంత గొప్ప విజయాన్ని అందుకున్నందుకు ఉప్పెన టీం అభినందనలు తెలిపారు. ఈ చిత్రాన్ని దర్శకుడు బుచ్చిబాబు అద్భుతంగా చిత్రీకరించాడని, ఇలాంటి సినిమాను తీసినందుకు బుచ్చిబాబు అంటే గౌరవం ఏర్పడిందదన్నారు. అలాగే దేవి శ్రీ ప్రసాద్‌ అందించిన సంగీతం సినిమాకు ఆత్మవంటిదన్నారు. విజయ్‌ సేతుపతి తన నటనతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారని మెచ్చుకున్నారు.

ముఖ్యంగా హీరో వైష్ణవ్ తేజ్ పర్ఫార్మెన్స్ గురించి ప్రశంసించారు. ఓ డెబ్యూ చిత్రంలో ఇంతగొప్పగా నటించిన మరో హీరోను నేను చూడలేదంటూ కొనియాడారు. అలాగే అలాగే హీరోయిన్ కృతి శెట్టి.. విజయ్ సేతుపతి నటన గురించి ప్రశంసించారు. కథను నమ్మి మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఉప్పెన సినిమా.. కథలపై వాళ్లకున్న నమ్మకాన్ని, ధైర్యాన్ని తెలియజేస్తుందని తెలిపారు. డీఓపీ, టెక్నికల్‌ టీం పనితనం బాగుందన్నారు. ఉప్పెన సినిమా తనకు చాలా బాగా నచ్చిందని.. ఇలాంటి అద్భుతమైన సినిమాలు మరిన్ని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా బన్నీ ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలోనే పుష్ప సినిమాలో నటిస్తున్నారు.