బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వాలని ప్లాన్‌ చేస్తున్న అల్లు అర్జున్‌

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో పుష్ప అనే పాన్‌ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి తరహాలోనే పుష్ప మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమా షూటింగ్‌ పూర్తయిన వెంటనే అల్లు అర్జున్‌ ఏ డైరెక్టర్‌తో మూవీ చేయనున్నాడు అనే అంశం ఆసక్తిగా మారింది.

ఇప్పటికే కొరటాల శివతో మూవీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినా కారటాల మాత్రం ఎన్టీఆర్‌తో సినిమా పూర్తయిన తర్వాతే బన్నీ ప్రాజెక్టును పట్టాలెక్కించాలని అనుకుంటున్నాడట. సో ఈ గ్యాప్‌లో ఓ మూవీ చేయాలని బన్నీ భావిస్తున్నాడట. ఇప్పటికే పలువురు దర్శకులు ఆయనతో మూవీ కోసం సంప్రదింపులు జరుపుతున్నారట. అయితే అనూహ్యంగా పుష్ప అనంతరం బన్నీ బాలీవుడులో ఎంట్రీ ఇవ్వాలని డిసైడయ్యాడట.

ఇప్పటికే కొందరు బాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్లు ఆయనకు కథలు వినిపిస్తున్నట్లు సమాచారం. బన్నీకి సౌత్‌లోనూ నార్త్‌లోనూ క్రేజ్‌ ఉన్న నేపథ్యంలో ఆయనతో సినిమా చేసేందుకు దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారట. మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకొని బాలీవుడ్‌లో ఓ మంచి కథతో ఎంట్రీ ఇవ్వాలని ప్లాన్‌ చేస్తున్నట్లు టాక్‌.

త్వరలోనే దీనికి సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ రానుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక అల్లు అర్జున్‌కు ఇది వరకే బాలీవుడ్‌లో అవకాశాలు వచ్చినా వాటిని పక్కనపెట్టాడు. అయితే ఈసారి మాత్రం బాలీవుడ్‌లో డైరెక్ట్ ఎంట్రీకి ఇదే కరెక్ట్ టైమ్ బన్నీ భావిస్తున్నాడట. ప్రస్తుతం బన్నీ ఫోకస్‌ అంతా బాలీవుడ్‌పైనే అనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన అనౌన్స్‌ చేసే తర్వాతి ప్రాజెక్ట్‌ ఏంటన్నది ఆసక్తికరంగా మారింది