60 కోట్ల బంగ్లా కొన్న అజయ్‌ దేవ్‌గణ్‌

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అజయ్‌ దేవ్‌గణ్‌ ఓ ఇల్లు కొన్నాడట. ముంబైలోని జుహులో ఓ విలాసవంతమైన ఇంటిని అతడు తన సొంతం చేసుకున్నట్లు బీటౌన్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ప్రస్తుతం అతడు ఉంటున్న ఇంటికి సమీపంలోనే ఉందట. 590 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ కొత్త బంగ్లా కోసం అజయ్‌ రూ.60 కోట్లు వెచ్చించాడట. ఇక ఇదే ప్రాంతంలో బాలీవుడ్‌ ప్రముఖులు హృతిక్‌ రోషన్‌, అమితాబ్‌ బచ్చన్‌, ధర్మేంద్ర ప్రసాద్‌, అక్షయ్‌ కుమార్‌ కూడా నివాసముంటున్న విషయం తెలిసిందే.

నిజానికి అజయ్‌ దేవ్‌గణ్‌ ఓ కొత్త ఇంటిని కొనుగోలు చేయాలని గత ఏడాది నుంచే ప్లాన్‌లో ఉన్నాడు. అందులో భాగంగా కపోలే కోఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీతో డిసెంబర్‌లో మంచి డీల్‌ కూడా కుదుర్చుకున్నాడు. మే 7న బంగ్లాను తన పేరు మీద రాయించుకున్నాడు. ఇదిలా వుంటే అర్జున్‌ కపూర్‌ కూడా ముంబైలోని బాంద్రాలో ఓ ఫ్లాట్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.