న‌టుడి వింత కోరిక

జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి అంటారు. ఓ న‌టుడి వింత కోరిక గురించి తెలిస్తే … ఇది ఎంత నిజ‌మో అర్థం చేసుకోవ‌చ్చు. ఇటీవ‌ల కాలంలో నేత్ర‌దానం, అవ‌య‌వ‌దానంపై జ‌నంలో చైత‌న్యం పెరుగుతోంది. మ‌నిషి చ‌నిపోయిన త‌ర్వాత నేత్ర‌దానం వ‌ల్ల మ‌రో ఇద్ద‌రికి చూపు ప్ర‌సాదించ‌వ‌చ్చ‌ని వైద్యులు చేస్తున్న ప్ర‌చారానికి ఇప్పుడిప్పుడే మంచి స్పంద‌న వ‌స్తోంది. అలాగే అవ‌య‌వ‌దానంపై కూడా మంచి స్పంద‌నే ల‌భిస్తోంది.తాము చ‌నిపోయినా ఏదో ర‌కంగా గుర్తుండాల‌నే ఆశ‌యానికి తోడు, త‌మ దేహం స‌మాజానికి ఏదో ర‌కంగా ఉప‌యోగ‌ప‌డాల‌ని భావించే వాళ్లు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్లు త‌మ మ‌ర‌ణానంత‌రం మృత‌దేహాన్ని వైద్య‌శాల‌కు అప్ప‌గిస్తూ ముంద‌స్తు ఒప్పంద పత్రాల‌పై సంత‌కాలు చేస్తుండ‌డం తెలిసిందే. అయితే ఓ న‌టుడు తాను చనిపోయిన త‌ర్వాత మృత‌దేహాన్ని ఏం చేయాలో చెప్పిన సంగ‌తి తెలిస్తే అవాక్కు కావాల్సిందే.బ్రిట‌న్‌కు చెందిన హాస్య‌న‌టుడు , నిర్మాత‌, ద‌ర్శ‌కుడు రికీ జెర్వీస్ ఓ చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో చెప్పిన విష‌యం గురించి తెలిస్తే … ఇదేం హాస్యం కాదు క‌దా అని ఎవ‌రైనా ప్ర‌శ్నించ‌కుండా ఉండ‌రు. రికీ ‘ఆఫ్టర్‌ లైఫ్‌’ అనే వెబ్‌సిరీస్‌లో నటించాడు. గత ఏడాది ‘ఆఫ్టర్‌ లైఫ్‌ 2’ విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. మీరు చనిపోయిన తర్వాత మీ మృతదేహాన్ని ఏం చేయాలని కోరుకుంటున్నారు? అని వ్యాఖ్యాత స‌ద‌రు హాస్య న‌టుడిని ప్రశ్నించారు. వెంటనే రికీ స్పందిస్తూ.. తన మృతదేహాన్ని లండన్‌ జూలో ఉన్న సింహాలకు ఆహారంగా అందించాలని కోరాడు.  తన మృత‌దేహం కనీసం అలాగైనా ఉపయోగపడుతుందని చెప్పి ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ఈ సంద‌ర్భంగా తానెందుకు అలా కోరుతున్నాడో కూడా వివ‌ర‌ణ ఇచ్చాడు.  ‘ప్రపంచం నుంచి మనం అన్ని తీసుకుంటున్నాం. స్వేచ్ఛగా తిరిగే జంతువులను తింటున్నాం, అడవులను నరికేస్తున్నాం. అన్నింటినీ నాశనం చేస్తున్నాం. కానీ, తిరిగి ఏమీ ఇవ్వట్లేదు. అందుకే సింహాలకు ఆహారంగానైనా ఉపయోగపడాలి’ అని చెప్పుకొచ్చాడు. తన మృతదేహాన్ని సింహాలు తింటుంటే.. అక్కడికి వచ్చే సందర్శకుల ముఖాల్లోని ఫీలింగ్స్‌ను చూడాల‌ని కూడా అత‌ను అభిప్రాయ‌ప‌డ‌డం గ‌మ‌నార్హం. ఒకొక్క‌రి మ‌న‌సులో ఎన్నెన్ని ర‌కాల భావాలుంటాయో రికీ మాట‌లు తెలియ‌జేస్తున్నాయి.