ఇల్లందు జె.కే గనిలో “ఆచార్య”షూటింగ్

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రం షూటింగ్‌ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు జేకే మైన్స్‌లో జరుగనుంది. ఈ సందర్భంగా ఆచార్య చిత్ర దర్శకుడు కొరటాల శివ శుక్రవారం ఖమ్మంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. మార్చి 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఇల్లెందు జేకే మైన్స్‌ ఓపెన్‌ కాస్ట్‌, అండర్‌ గ్రౌండ్‌ మైనింగ్‌లో షూటింగ్‌ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో హీరో చిరంజీవి, రాంచరణ్‌పై సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. చిత్రీకరణ అనుమతుల కోసం చిత్ర దర్శకుడు కొరటాల శివ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ను కలిశారు. అనుమతులతోపాటు హీరో చిరంజీవికి స్వయంగా తన నివాసంలో ఆతిథ్యం ఇవ్వనున్నట్లు మంత్రి పువ్వాడ తెలిపారు. ఖమ్మం ఎంతో అభివృద్ధి చెందిందని, వివిధ చిత్రాల షూటింగ్‌ కోసం ఇక్కడ అనువుగా ఉందని కొరటాల శివ పేర్కొన్నారు. ఖమ్మం నగర స్వరూపం పూర్తిగా మారిపోయిందని, అందుకు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు కొరటాల అభినందనలు తెలిపారు.