నాగ్ తో డీల్ కుదుర్చుకున్న బిగ్‌బాస్ విజేత

తెలుగు నాట బిగ్‌బాస్‌ రియాలిటీ షోకు స్పెషల్‌ క్రేజ్‌ ఉంది. బిగ్‌బాస్‌ వస్తుందంటే చాలు సీరియళ్లకు ఫుల్‌స్టాప్‌ పెడ్తూ రిమోట్‌ మార్చేస్తుంటారు. మా టీవీలో ప్రసారమయ్యే బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వీళ్లే నేరుగా ప్రవేశించినంత సంబరపడిపోతుంటారు. ఇక వారి ఫేవరెట్‌ సెలబ్రిటీలు కంటెస్టెంట్లుగా వస్తే వాళ్ల ఆనందాన్ని మాటలో చెప్పలేము. హాట్‌స్టార్‌ ఓట్లు మాత్రమే కాదు మిస్‌డ్‌ కాల్స్‌ కూడా ముఖ్యమేనంటూ లోపల ఉన్న పోటీదారులను ఎలిమినేషన్‌ నుంచి గట్టెక్కించేందుకు నానా రకాలుగా కష్టపడుతారు.

మొత్తానికి తెలుగు బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో అందరూ ఊహించినట్లుగానే అభిజిత్‌ విజేతగా అవతరించాడు. కానీ సోహైల్‌ రూ.25 లక్షలు తీసుకుని టైటిల్‌ రేసు నుంచి తప్పుకోవడంతో అభిజిత్‌ ప్రైజ్‌మనీలో కోత పడింది. దీంతో అతడు కూడా పాతిక లక్షలు తీసుకుని ట్రోఫీని పట్టుకెళ్లిపోయాడు. షో తర్వాత తనకున్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ చూసి అభిజిత్‌ నోరెళ్లబెట్టాడు. తనను గెలిపించిన ప్రేక్షకులకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలనని వారి మీద ప్రేమను వ్యక్తం చేశాడు.

అయితే అతడు సినిమాల్లోకి వస్తే చూడాలని ఉందని చాలా మంది అభిమానులు ఎదురు చూస్తుండగా అభిజిత్‌ మాత్రం పలు కారణాలు చెప్తూ తన దగ్గరకు వచ్చిన కథలను రిజెక్ట్‌ చేశాడు. దీంతో ఫ్యాన్స్‌ కొంత నిరుత్సాహపడ్డారు. అయితే తాజాగా ఫిల్మీ దునియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. అభిజిత్‌ ఏకంగా నాగార్జునతో డీల్‌ కుదుర్చుకున్నాడట. అవును, నాగ్‌ సొంత సంస్థ‌ అన్నపూర్ణ స్టూడియోస్‌తో ఓ మూడు సినిమాలు చేసేందుకు అభిజిత్‌ సంతకం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే వీటికి దర్శకులను వెతికే పనిలో పడ్డారట. అంటే దర్శకులు దొరికేయగానే అభిజిత్‌ ఒకేసారి మూడు ప్రాజెక్టుల్లో పని చేస్తూ ఊపిరి సలపనంత బిజీగా ఉండబోతున్నాడని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా అన్నపూర్ణ స్టూడియోస్‌ అభిజిత్‌తో ఓకేసారి మూడు సినిమాలకు డీల్‌ కుదుర్చుకోవడమంటే మామూలు విషయం కాదని కామెంట్లు చేస్తున్నారు. కానీ ఇప్పటివరకైతే దీని గురించి ఎటువంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.