30 రోజుల్లో ప్రేమించడం ఎలా రివ్యూ & రేటింగ్

రేటింగ్‍: 3/5

టైటిల్‌ : 30 రోజుల్లో ప్రేమించడం ఎలా
జానర్ :  రొమాంటిక్ ఎంటర్ టైనర్‏
నటీనటులు : ప్రదీప్‌ మాచిరాజు, అమృతా అయ్యర్‌, శుభలేఖ సుధాకర్‌, పోసాని కృష్ణమురళి, హేమ, వైవా హర్ష హైపర్‌ ఆది తదితరులు
నిర్మాణ సంస్థ :  ఎస్వీ ప్రొడక్షన్‌
నిర్మాత :  ఎస్వీ బాబు
దర్శకత్వం : మున్నా ధూళిపూడి
సంగీతం : అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ :  దాశరథి శివేంద్ర
విడుదల తేది : జనవరి 29, 2021

‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ టీవీ ప్రేక్షకులకు సుపరిచితుడైన ప్రదీప్‍ను వెండితెరపైకి తెచ్చింది. అతని హీరో వేషానికి అటెన్షన్‍ ఎంత వచ్చి వుండేదనేది అటుంచితే, ‘నీలి నీలి ఆకాశం’ పాట వైరల్‍ అయి ఈ సినిమాను చాలా మంది గుర్తించేట్టు చేసింది.ఆ పాట ఇచ్చిన నమ్మకంతో సినిమాకు వెళ్లిన వారిని ఎక్కువ సమయం ఎదురుచూడనివ్వకుండా మొదటి పది నిమిషాలలోనే పాటొచ్చేస్తుంది. ఆ పాటే సినిమాకు ట్రంప్‍ కార్డ్ అయినపుడు దానిని మొదటి రీల్లో వేసేయడం కరక్ట్ కాదు. ఆ పాట కోసం కాసేపు ఎదురు చూసేలా చేస్తే పాటకు ఇటువైపు ఎన్ని విసుగెత్తించే సన్నివేశాలు వున్నప్పటికీ ఆ పాటొచ్చినప్పుడు వాటిని ప్రేక్షకులు కొంతవరకు క్షమించడం లేదా విస్మరించడం జరుగుతుంది.దర్శకుడు మున్నా కథనే విచిత్రంగా రాసుకున్నాడు. హాలీవుడ్‍ సినిమాల్లో ఎక్కువగా కనిపించే బాడీ స్వాపింగ్‍ కాన్సెప్ట్కి మన సినిమాలకు హిట్‍ థీమ్‍ అయిన పునర్జన్మ ఎలిమెంట్‍ జత చేసి ఒక విచిత్రమైన కిచిడీ తయారు చేసాడు.కథ తయారీలో చిత్రమైన మిశ్రమం వాడిన దర్శకుడు సన్నివేశాలకు సన్నివేశాలను హిట్‍ సినిమాల నుంచి లిఫ్ట్ చేసేసాడు. త్రీ ఇడియట్స్లోని ఒక కీలక సన్నివేశంతో పాటు పటాస్‍లోని ఒక కామెడీ సీన్‍ను ఈ సినిమాలో పెట్టేసుకున్నాడు. అయితే ఎన్ని మిశ్రమాలు కలిపినా, ఎక్కడ్నుంచి కాపీ కొట్టినా ‘ముప్పయ్‍ నిమిషాలు భరించడం ఎలా?’ అని ప్రేక్షకులు తలలు పట్టుకునేట్టు చేసాడు.

కథ
వైజాగ్‌లో ఓ కాలేజీలో ఇంజనీరింగ్‌ చదివే అల్లరి స్టూడెంట్‌ అర్జున్‌(ప్రదీప్‌ మాచిరాజు).  చదువంటే ఇష్టం ఉండదు కానీ బాక్సింగ్‌ అంటే ప్రాణం. అదే కాలేజీలో కొత్తగా జాయిన్‌ అయిన విద్యార్థిని అక్షర(అమృతా అయ్యర్‌). అమృతకి, అర్జున్‌కి అసల్‌‌ పడదు. ఒకరంటే ఒకరికి కోపం, పగ, ద్వేషం. అనుకోకుండా వీరిద్దరు ఫ్రెండ్స్‌తో కలిసి విహారయాత్రకు వెళ్లాల్సి వస్తోంది. అక్కడ వీరిద్దరికి ఓ పెద్ద సమస్య ఎదురువుతోంది. ఆ సమస్యకు పరిష్కారమేంటో స్వామిజీ(శుభలేక సుధాకర్‌) చెప్తాడు. దీంతో వీరిద్దరు ఇష్టంలేకున్నా 30 రోజుల్లో ప్రేమించుకోవాల్సి వస్తోంది. అసలు వీరిద్దరికి ఎదురైన సమస్య ఏంటి? అసలు వీరి జీవితాలకు, స్వామిజికి సంబంధం ఏంటి? వీరిద్దరికి ఒకరంటే ఒకరు ఎందుకు పడదు? ఇష్టం లేని వీరిద్దరు ఎందుకు ప్రేమించుకోవాల్సి వచ్చింది? చివరకు వీరి సమస్యకు పరిష్కారం దొరికిందా లేదా? అనేదే మిగతా కథ.

నటీనటులు
బుల్లితెరపై యాంకర్‌గా తనదైన ముద్రవేసుకున్నాడు ప్రదీప్‌. తనదైన కామెడీ పంచ్‌లతో, సెన్సాఫ్ హ్యూమ‌ర్‌తో ఎన్నో షోలను విజయవంతం చేశాడు. షోలో ప్రదీప్‌ ఉంటే చాలు కామెడీకి కొదవ ఉండదు. తొలి సినిమాలో కూడా అదే కామెడీతో నవ్వించాడు ప్రదీప్‌. అర్జున్‌ అను అల్లరి స్టూడెంట్‌ పాత్రలో జీవించేశాడు. తొలి సినిమాయే అయినా.. ఎంతో అనుభవం ఉన్న హీరోలా నటించేశాడు. యాంకర్‌గా తనకున్న ఎక్స్‌పీరియన్స్‌ సినిమాకు బాగా ఉపయోగపడిందనే చెప్పాలి. తనదైనశైలీలో నవ్విస్తూనే.. అవసరం ఉన్న చోట ఎమోషనల్‌ సీన్లను కూడా అవలీలగా చేసేశాడు.ప్రదీప్‌ తర్వాత బాగా పండిన పాత్ర అమృతది. అక్షర అనే యువతి పాత్రలో అమృత జీవించేసింది. ప్రేమ సన్నివేశాలతో పాటు, కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో కూడా తన పెర్ఫార్మెన్స్ తో మెప్పించింది. ఇక పోసాని కృష్ణమురళి, హేమల అనుభవం మరోసారి తెరపై చూడొచ్చు. వైవా హర్ష తనదైన కామెడీతో అందరిని నవ్వించేశాడు. హైపర్‌ ఆది, మహేశ్‌, శుభలేఖ సుధాకర్‌ తమ పాత్రలపరిధి మేర నటించారు.

విశ్లేషణ
యాంకర్‌ ప్రదీప్‌ మాచిరాజుకు ఇది తొలి సినిమా. మొదటి సినిమాతోనే ప్రదీప్‌చేత ప్రయోగం చేయించాడు దర్శకుడు మున్నా. పునర్జన్మల కథ ఎంచుకోని దర్శకుడు మంచి ప్రయత్నమే చేశాడు. కానీ ఆ కథని తెరపై చూపించడంతో కాస్త తడబడ్డాడు. నేటి ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కథాకథనాలను రాసుకోలేదు. హీరో, హీరోయిన్ల మధ్య వచ్చిన ప్రేమ సన్నివేశాలు కూడా పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధండా ఉండవు. అలాగే సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలు సినిమాటిక్‌గా అనిపిస్తాయి తప్ప, ఆడియన్స్‌ని ఇన్‌వాల్వ్‌ అయ్యేవిధంగా అనిపించవు. సీరియస్‌ కథ అయినా.. కామెడీతో నడిపించేప్రయత్నం చేసి కాస్త విఫలమయ్యాడు. హీరో, హీరోయిన్ల మధ్య చోటు చేసుకునే కొన్ని సన్నివేశాలు బోర్‌ కొట్టిస్తాయి.ఫస్ట్ హాఫ్ లో ఒక్క ఇంటర్వెల్ సీన్ మినహా మిగతా సన్నివేశాలు అంతగా ఆకట్టుకోవు. అలాగే సెకండాఫ్ లో వచ్చే కొన్ని సీన్లు సాగదీతగా అనిపిస్తాయి. ఫస్టాప్‌ను కామెడీగా నడిపించిన దర్శకుడు.. సెకండాఫ్‌ను ఎమోషనల్‌గా నడుపుదామనుకొని కాస్త విఫలం అయ్యాడు. ఆ ఎమోషన్ గాని, ఆ ఫీల్ గాని ఆడియన్స్ ఫీల్ అవ్వరు. ఇక సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ అందించిన పాటలు చాల బాగున్నాయి. ముఖ్యంగా నీలి నీలి ఆకాశం పాట ఎంత గొప్పగా హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆయన అందించిన నేపధ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ బాగాలేదు. కత్తెరకు బాగా పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు కథానుసారం బాగున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే. ఈ సినిమా ‘నీలి నీలి ఆకాశం’ పాట అంత బాగాలేదు కానీ, చూడొచ్చు.

ప్లస్ పాయింట్స్ :
ప్రదీప్‌ మాచిరాజు, అమృతా అయ్యర్‌ నటన
ఇంటర్వెల్‌ ట్విస్ట్‌
అనూప్‌ రూబెన్స్‌ సంగీతం

మైనస్‌ పాయింట్స్‌
కథాకథనం
సాగదీత సీన్లు
ప్రీ క్లైమాక్స్
అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

 

 

content source :sakshi news