కరోనా ప్రభావంతో గత ఏడాది వెండితెర వెలవెలబోయింది. చిత్రీకరణలు నిలిచిపోవడంతో పాటు థియేటర్లు మూతపడటంతో తెలుగు చిత్రసీమలో స్తబ్దత నెలకొంది. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో తిరిగి ఇండస్ట్రీలో సందడి మొదలైంది. దీంతో కరోనా కారణంగా ఆగిపోయిన సినిమాలన్నీ సెట్స్‌పై కొలువుదీరాయి. త్వరలో ప్రేక్షకుల్ని పలకరించేందుకు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే పాన్‌ఇండియా చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’ ను దసరా కానుకగా విడుదల చేస్తామని ప్రకటించారు. ‘వకీల్‌సాబ్’‘లవ్‌స్టోరీ’ ‘టక్ జగదీష్’ ఏప్రిల్‌లో ప్రేక్షకులముందుకురానున్నాయి. ఫిబ్రవరి 12న ‘ఉప్పెన’, 19న ‘చెక్’, మార్చిలో ‘శ్రీకారం’ ‘రంగ్‌దే’ రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. మే నెలలో ‘ఆచార్య’ విడుదలకానుంది. ఇదే వరుసలో రాబోవు మాసాల్లో పలు భారీ చిత్రాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి.
ఆగస్ట్ 13న ‘పుష్ప’ ఆగమనం
అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. రష్మిక మందన్న కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా నిర్మిస్తోంది. ప్రస్తుతం ఏపీలోని మారేడుమిల్లి అరణ్యంలో చిత్రీకరణ జరుగుతోంది. అల్లు అర్జున్‌తో పాటు చిత్ర ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 13న విడుదల చేయబోతున్నట్లు నిర్మాణ సంస్థ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన తాజా పోస్టర్‌లో అల్లు అర్జున్ అడవిలో ఎర్రచందనం కూలీల మధ్య గొడ్డలి పట్టుకొని కూర్చొని రౌద్రంగా కనిపిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లర్స్, వారి నేరమయ జీవనంలోని భిన్న పార్శాల్ని ఆవిష్కరిస్తూ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం అన్ని భాషల వారికి కనెక్ట్ అవుతుందని చిత్రబృందం తెలిపింది.
కబడ్డీ కోచ్ యుద్ధం
గోపీచంద్ కథానాయకుడిగా సంపత్‌నంది దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘సీటీమార్’. శ్రీనివాస చిట్టూరి నిర్మాత. తమన్నా కథానాయిక. ఏప్రిల్ 2న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. నిర్మాత మాట్లాడుతూ ‘క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఎమోషనల్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఇది. టాకీపార్ట్ పూర్తయింది. రెండు పాటలు బ్యాలెన్స్‌గా ఉన్నాయి’ అని అన్నారు.
జూలై 30న ‘గని’
వరుణ్‌తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘గని’ జూలై 30న ప్రేక్షకులముందుకురానుంది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సిద్ధు ముద్ద, అల్లు బాబీ నిర్మిస్తున్నారు. సయిమంజ్రేకర్ కథానాయిక. ‘ఇందులో వరుణ్‌తేజ్ బాక్సర్‌గా పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తారు. ఈ పాత్ర కోసం ఆయన ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు’ అని చిత్రబృందం తెలిపింది.
ప్రేమ విప్లవం
రానా, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘విరాటపర్వం’. ‘రివల్యూషన్ ఈజ్ ఎన్ యాక్ట్ ఆఫ్ లవ్’ ఉపశీర్షిక. సుధాకర్ చెరుకూరి నిర్మాత. వేణు ఊడుగుల దర్శకుడు. ఏప్రిల్ 30న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో సార్వత్రిక కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. తాను నమ్మిన సిద్ధాంతం కోసం కామ్రేడ్ రవన్న ఎలాంటి పోరాటం సాగించాడన్నది ఆకట్టుకుంటుంది’ అని చిత్రబృందం తెలిపింది.
ఆగస్ట్ 27న ‘ఎఫ్-3’
వెంకటేష్, వరుణ్‌తేజ్ కథానాయకులుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం ‘ఎఫ్-3’. 2019లో వచ్చిన ‘ఎఫ్-2’ చిత్రానికి సీక్వెల్ ఇది. తమన్నా, మెహరీన్ కథానాయికలు. దిల్‌రాజు సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఆగస్ట్ 27న విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘డబ్బుల చుట్టూ తిరిగే ఈ కథలో కావాల్సినంత వినోదం ఉంటుంది. ‘ఎఫ్-2’ కంటే మూడింతల హాస్యంతో ఆకట్టుకుంటుంది’ చిత్రబృందం తెలిపింది.