2021 పూర్తిగా మెగా నామ సంవత్సరంగా మారబోతుంది. ఎప్పుడూ లేని విధంగా ఆ ఫ్యామిలీలో ఉన్న ప్రతీ హీరో నుంచి కనీసం ఒక్క సినిమా రాబోతుంది. చాలా కాలంగా పవన్ కళ్యాణ్ నుంచి సినిమాలు రావడం లేదు. కానీ 2021లో ఈయన నుంచి కూడా రెండు సినిమాలు వస్తున్నాయి. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి సైతం రెండు సినిమాలతో వస్తున్నాడు. ఆయనతో పాటు రామ్ చరణ్ రెండు సినిమాలు.. అల్లు అర్జున్ ఒకటి.. వరుణ్ తేజ్ ఒకటి.. సాయి ధరమ్ తేజ్ ఓ సినిమా విడుదల చేయనున్నారు. అల్లు శిరీష్, మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్, కొత్త వారసుడు వైష్ణవ్ తేజ్ కూడా ఒక్కో సినిమాతో వస్తున్నారు. ఇంకా కుదిర్తే వైష్ణవ్ తేజ్ నుంచి ఉప్పెనతో పాటు క్రిష్ సినిమా కూడా విడుదల కానుంది.
ముందుగా చిరంజీవిని తీసుకుంటే ఈయన నటిస్తున్న ఆచార్య సినిమా మేలో విడుదల కానుంది. ఆ తర్వాత లూసీఫర్ రీమేక్ సైతం ఇదే ఏడాది విడుదల కానుంది. మోహన్ రాజా దీనికి దర్శకుడు. మరోవైపు పవన్ కళ్యాణ్ ముందుగా వకీల్ సాబ్‌తో ఎప్రిల్ లో వస్తున్నాడు. ఆ తర్వాత అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ కూడా ఇదే ఏడాది విడుదల కానుంది. సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు రాస్తున్నాడు. మరోవైపు రామ్ చరణ్ కూడా ఆచార్యతో పాటు ట్రిపుల్ ఆర్ సినిమాతో ఇదే ఏడాది వస్తున్నాడు. ఈ సినిమా అక్టోబర్ 13న విడుదల కానుంది. మరోవైపు అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమా ఆగస్ట్ 13న విడుదల కానుంది.
వరుణ్ తేజ్ నటిస్తున్న గని జులై 30న వస్తుంటే.. సాయి ధరమ్ తేజ్, దేవా కట్టా రిపబ్లిక్ సినిమా సమ్మర్ 2021లో విడుదల కానుంది. ఈ మధ్యే సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో విజయం అందుకున్నాడు మెగా మేనల్లుడు. ఇక అల్లు శిరీష్ కొత్త దర్శకుడితో చేస్తున్న సినిమాను కూడా 2021లోనే విడుదల చేయనున్నారు. కళ్యాణ్ దేవ్ సూపర్ మచ్చి కాకుండా కిన్నెరసాని సినిమాతో వస్తున్నాడు. ఇలా ఈ ఏడాది చిరు నుంచి 2.. రామ్ చరణ్ నుంచి 2.. పవన్ కళ్యాణ్ నుంచి 2..వైష్ణవ్ తేజ్ నుంచి 2.. కళ్యాణ్ దేవ్ నుంచి 2.. అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వరణ్ తేజ్, శిరీష్ లాంటి హీరోల నుంచి ఒక్కో సినిమా విడుదల కానున్నాయి. మొత్తానికి మెగా ఫ్యామిలీ నుంచి 2021లో ఏకంగా 14 సినిమాలు వచ్చేస్తున్నాయి.