న్యూఢిల్లీ: దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ రికార్డులు నెలకొల్పింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించిన నేపథ్యంలో మధ్యాహ్నం 3,32 గంటలకు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) ఇండెక్స్ సెన్సెక్స్ 2,314.84 పాయింట్లు దాటి 48,600.61 పాయింట్ల వద్ద స్థిరపడింది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ బ్యాంకింగ్ ఇండెక్స్ ఏడు శాతం లబ్ధి పొందింది. సెన్సెక్స్‌లో ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్ 11 శాతానికి పై చిలుకు అత్యధికంగా లాభపడింది. దాని కొనసాగింపుగా ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఎం అండ్ ఎం, యాక్సిస్ బ్యాంక్ స్క్రిప్టులు లాభాల బాటలో సాగాయి.
ద్రవ్యలోటు విస్తరణకు అనుమతి
కరోనా మహమ్మారి సవాల్ విసురుతున్న తరుణంలో లక్ష్యాలను దాటుకుని ద్రవ్యలోటు పెరిగేందుకు విధాన నిర్ణేతలు అనుమతించారు. మరోవైపు ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం కోసం వ్యయం పెంచడం ద్వారా నిర్మలా సీతారామన్ సరైన చర్యలే తీసుకున్నారు. హౌసింగ్ రంగానికి మౌలిక వసతులు, హెల్త్ అండ్ టెక్స్‌టైల్స్‌రంగాలకు అంచనాలకు మించి కేటాయింపులు చేశారు.
పీఎస్‌యూల ప్రైవేటీకరణపై సర్కార్ స్పష్టమైన వైఖరి
దీర్ఘకాలికంగా పన్నుల చెల్లింపులపై స్క్రూటినీకి తెర దించడంతోపాటు ముఖ్యమైన ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించాలని ద్రుఢమైన వైఖరితో ప్రభుత్వం ముందుకు వెళుతున్నది. బ్యాడ్ లోన్లకు (మొండి బకాయిలు) ఏఆర్సీలను స్రుష్టించడం, మోనిటైజ్ గవర్నమెంట్ ల్యాండ్ బ్యాంక్స్‌వంటి చర్యలు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సరైన చర్యలే. ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్లపై ఎల్‌టీసీజీ పెంపు లేదా సంపద పన్ను విధించడం వంటి చర్యలు లేకపోవడంతో మార్కెట్లలకు ఊపునిచ్చాయి.
ఇలా బలపడిన ఇన్వెస్టర్ సెంటిమెంట్
స్పష్టమైన సర్దుబాట్లతో బడ్జెట్ ఉండటం కూడా ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ బలపడింది. ఎకనమిక్ గ్రోత్ బూస్ట్ కోసం కీలక రంగాలపై ఫోకస్ చేయడం కూడా కలిసి వచ్చింది. ఎంకే గ్లోబల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ క్రుష్ణ కుమార్ కర్వా మాట్లాడుతూ ఈ బడ్జెట్ వచ్చే 100 ఏండ్ల పాటు గుర్తుండిపోయేలా చేస్తానన్న హామీకి కట్టుబడి ఉన్నందుకు ఆర్థిక మంత్రికి హ్యాట్సాప్ చెబుతున్నట్లు పేర్కొన్నారు. ప్రత్యక్ష పన్నుల్లో మార్పుల్లేకుండా బడ్జెట్ సమర్పించడం భవిష్యత్ తరాలకు గుర్తుండిపోతుందని వ్యాఖ్యానించారు.
రెండు బ్యాంకులు, ఎల్ఐసీ ప్రైవేటీకరణతో బూస్ట్
రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ, బీమా రంగంలో ఎఫ్‌డీఐ పరిమితి 74 శాతానికి పెంచడం గమనార్హం. ఇక మున్ముందు పెట్టుబడుల పురోభివ్రుద్ధి కోసం ఎంతోకాలంగా వేచి చూస్తున్న డెవలప్‌మెంట్ ఫైనాన్స్ బ్యాంక్ (డీఎఫ్ఐ) ఏర్పాటు చేయడం ఆహ్వానించదగ్గ పరిణామం. గత నాలుగైదు నెలలుగా పునరుద్ధరణ దిశగా సాగుతున్న ఆర్థిక వ్యవస్థను మరింత ముందుకు తీసుకెళ్లడానికి పలు బడ్జెట్ ప్రతిపాదనలు ఉపకరిస్తాయి. సమర్థవంతంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలను ఉపసంహరించడంతో మౌలిక వసతుల కల్పనకు త్వరితగతిన వనరులు సమకూరడంతోపాటు 2021-22లో ద్రవ్యలోటు 6.3 శాతం లక్ష్యాలను చేరవచ్చు.
రూ.20 వేల కోట్లతో డెవలప్మెంట్ ఫైనాన్స్ సంస్థ
రూ.20 వేల కోట్ల పెట్టుబడితో డెవలప్‌మెంట్ ఫైనాన్స్ ఇన్‌స్టిట్యూషన్ (డీఎఫ్ఐ)ని ఏర్పాటు చేస్తామని బడ్జెట్ ప్రతిపాదనల్లో నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పెట్టుబడులకు ఆర్థిక సాయం అవసరైమన రంగాలకు రూ.5 లక్షల కోట్ల రుణ పరపతి కల్పించడానికి ఇది వెసులుబాటు కల్పిస్తుంది.
గ్లోబల్ మార్కెట్లలోనూ పెరుగుదల
వివిధ దేశాల స్టాక్ మార్కెట్లలో పెరుగుదల నమోదైంది. అక్టోబర్ తర్వాత తొలిసారి సోమవారం యూరోపియన్ షేర్లు వ్రుద్ధి చెందాయి. జియోజిట్ ఫైనాన్సియల్ సర్వీసెస్ ఎకనమిస్ట్ దీప్తి మాథ్యూ మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి ప్రభుత్వ వ్యయం పెంచారు, మౌలిక వసతులకు ప్రాధాన్యం కల్పించారన్నారు. మౌలిక వసతుల ప్రాజెక్టులకు అవసరమైన నిధులు, ఆదాయ వనరులు కల్పించడానికి డెవలప్మెంట్ ఫైనాన్స్ సంస్థ ఏర్పాటు, ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ సాహసోపేతమైన చర్య అని అభిప్రాయ పడ్డారు. ద్రవ్యలోటు గణాంకాలు ఉన్నతస్థాయిలో దూసుకెళ్లిన నేపథ్యంలో పన్నులు పెంచకపోవడం సానుకూల పరిణామం అని ఆర్థికవేత్తలు అభిప్రాయ పడుతున్నారు.