రైల్వే బాదుడు..

హైదరాబాద్‌: సికింద్రా‌బాద్ కేంద్రంగా ప‌నిచేస్తున్న ద‌క్షిణ మ‌ధ్య రైల్వే (ఎస్సీఆర్‌) ప్ర‌యాణికుల‌పై అక‌స్మాత్‌గా దాడి చేసింది. సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్లో అనూహ్యంగా ప్లాట్‌ఫామ్ టికెట్ ధ‌ర రూ.10 నుంచి రూ.30కి పెంచ‌డ‌మే దీనికి నిద‌ర్శ‌నం. దేశవ్యాప్తంగా రూ.10గా ఉన్న ధరను ఆయా స్టేషన్ల రద్దీకనుగుణంగా రూ.30 వరకు పెంచుకునేందుకు రైల్వేశాఖ అవకాశం ఇచ్చింది. దీన్ని ఎస్సీఆర్ అధికారులు సావ‌కాశంగా మార్చేసుకున్నారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ప్లాట్‌ఫామ్ టికెట్ ధ‌ర‌ను రూ.10 నుంచి రూ.30 చేసింది ఎస్సీఆర్‌. అదే హైద‌రాబాద్ (నాంప‌ల్లి) స్టేష‌న్‌లో ప్లాట్‌ఫామ్ టికెట్ ధ‌ర రూ.20కి పెంచారు. కాచిగూడ, మౌలాలి, మల్కాజిగిరి, లింగంపల్లి రైల్వేస్టేషన్లలో మాత్రం రూ.10 మాత్ర‌మే వ‌సూలు చేస్తున్నారు. క‌రోనాకు ముందు హైద‌రాబాద్‌లోని మూడు రైల్వేస్టేషన్లలో ప్ర‌తిరోజూ దాదాపు 25 వేల ప్లాట్‌ఫాం టిక్కెట్లు అమ్ముడయ్యేవి. తాజాగా పెరిగిన ధరలతో రైల్వేకు రోజుకు రూ.7.10 లక్షల వరకూ ఆదాయం సమకూరే అవకాశం ఉంద‌ని తెలుస్తున్న‌ది. రైల్వే అధికారులు ఎటువంటి ముందస్తు సూచనలు చేయ‌కుండానే సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ రైల్వేస్టేషన్లలో సోమవారం నుంచి ప్లాట్‌ఫాం టికెట్ల ధ‌ర‌లు పెంచేశారు. గ‌మ్మత్తేమిటంటే సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్లో కౌంటర్‌పై రూ.10 అని రాసి ఉన్న పాత టేబుల్ అలాగే ఉంది. కానీ కింద కౌంటర్‌ కిటికీ దగ్గర కాగితంపై ప్లాట్‌ఫామ్ టికెట్ రూ.30 అని రాసి పెట్టి అమ్మకాలు ప్రారంభించారు.  ఉన్నతాధికారులు స్పందిస్తూ.. కరోనా నేపథ్యంలో రద్దీని తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామ‌న్నారే గానీ.. క‌రోనా త‌గ్గిన త‌ర్వాత ధ‌ర‌లు త‌గ్గుతాయా? అంటే స‌రైన స‌మాధానం చెప్ప‌లేక‌పోయారు.