- 5జీ ల్యాబ్ నెలకొల్పిన మొబైల్ దిగ్గజం
- చైనా బయట అతిపెద్ద ఇన్నోవేషన్ కేంద్రం
- త్వరలో మరో మూడు ప్రయోగశాలలు
- స్వాగతించిన ఐటీశాఖ మంత్రి కేటీఆర్
హైదరాబాద్‌కు ఒప్పో కూడా వచ్చేసింది. తెలంగాణలో ఐటీ ప్రాభవాన్ని ఏ కరోనా వైరస్‌లూ.. ఆర్థిక సమస్యలూ అడ్డుకావడంలేదని మరోసారి రుజువైంది. మొన్నటికి మొన్న అమెజాన్.. నిన్న ఫియట్.. ఇవాళ ఒప్పో తన ఇన్నోవేషన్ ప్రయోగశాలను ఏర్పాటు చేయబోతున్నది. స్మార్ట్‌ఫోన్ల తయారీలో ప్రసిద్ధి చెందిన ఒప్పో చైనా వెలుపల తన ల్యాబ్‌ను ఏర్పాటుచేయడానికి హైదరాబాద్‌నే ఎంచుకోవడం మన ఐటీ ప్రస్థానంలో మరో కీలక మలుపు.
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ ‘ఒప్పో’ తన ఫైవ్(5)జీ ఇన్నోవేషన్ ల్యాబ్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పింది. ఒప్పో సంస్థ చైనాకు వెలుపల ఓ ప్రయోగశాలను స్థాపించడం ఇదే మొదటిసారి. దీనితోపాటు త్వరలో మరో మూడు ప్రయోగశాలలను కూడా హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్టు ఒప్పో సంస్థ వెల్లడించింది. హైదరాబాద్‌లోని తమ పరిశోధన, అభివృద్ధి సంస్థలో నూతన ఆవిష్కరణల కోసం కెమెరా, పవర్- బ్యాటరీ, పనితీరును మెరుగుపరిచే మూడు క్రియాశీలక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. ఒప్పో సంస్థ హైదరాబాద్‌లో ప్రయోగశాలను ఏర్పాటు చేయడాన్ని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు స్వాగతించారు. ట్విట్టర్ వేదికగా ఆయన స్పందిస్తూ.. ‘హైదరాబాద్‌లో ఆవిష్కరణల వ్యవస్థకు మరో దృఢమైన చేయూత లభించింది’ అని వ్యాఖ్యానించారు. విదేశాల్లో తాము నెలకొల్పిన మొట్టమొదటి 5జీ ల్యాబ్ ఇదేనని ఒప్పో ఇండియా వైస్ ప్రెసిడెంట్, ఆర్ అండ్ డీ అధిపతి తస్లీబ ఆరిఫ్ పేర్కొన్నారు. ఈ ల్యాబ్ నుంచే ప్రపంచ దేశాల కోసం అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు. పశ్చిమాసియా, దక్షిణాసియా, ఆఫ్రికా, జపాన్, యూరోప్‌కు ఇక్కడి నుంచి తమ నూతన ఆవిష్కరణలను సరఫరా చేస్తామని తెలిపారు. 5జీ ఈకోసిస్టమ్‌కు కీలకమైన పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం, భారత్‌లో విస్తరించడంపై దృష్టిని కేంద్రీకరించనున్నామని పేర్కొన్నారు. ఒప్పోకు 5జీ టెక్నాలజీని అభివృద్ధి చేయడం అత్యంత కీలకమని, 5జీ లక్ష్య సాధనలో భారత్ చేస్తున్న ప్రయత్నాలకు తోడ్పడుతామని తస్లీం వెల్లడించారు. భారత్‌ను ఆవిష్కరణలకు కేంద్రంగా మార్చాలన్నది తమ ప్రయత్నమని తెలిపారు. హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన ల్యాబ్‌లో అభివృద్ధి చేయబోయే సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా బలమైన ముద్ర వేయగలదని ఆశాభావం వ్యక్తంచేశారు. ఒప్పోకు చెందిన ఆర్ అండ్ డీ బృందం భారత్‌లోని జియో, ఎయిర్‌టెల్, క్వాల్‌కాం, మీడియాటెక్‌తో కలిసి పనిచేయనున్నది. ఐరోపా మార్కెట్‌లో తొలి 5జీ మొబైల్ ఫోన్లను ఆవిష్కరించిన ఒప్పో భారత్‌లో 5జీ వాట్సాప్ కాల్‌ను ప్రవేశపెట్టింది.
కేంద్ర వేతన ఒప్పందాలపై కేటీఆర్ ఆందోళన
కేంద్ర ప్రభుత్వ వేతన ఒప్పందాలతో గల్ఫ్ కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుందని మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. కార్మికుల వేతనాలు 30 నుంచి 50 శాతం వరకు తగ్గడం వల్ల లక్షల మంది తెలంగాణకు చెందిన గల్ఫ్ కార్మికులపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. కార్మికులకు నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్‌కు మంగళవారం ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తిచేశారు.