రీసైక్లింగ్ ప్లాంట్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్…

హైద‌రాబాద్ : జీడిమెట్ల‌లో భ‌వ‌న నిర్మాణ వ్య‌ర్థాల రీసైక్లింగ్ ప్లాంట్‌ను ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్, మంత్రి మ‌ల్లారెడ్డితో క‌లిసి శ‌నివారం ఉద‌యం ప్రారంభించారు. భ‌వ‌న నిర్మాణ వ్య‌ర్థాల‌కు చెక్ పెట్టేందుకు బల్దియా చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఈ క్ర‌మంలో 500 టీపీడీ సామ‌ర్థ్యం క‌లిగిన రీసైక్లింగ్ ప్లాంట్‌ను నిర్మించింది. రూ. 10 కోట్ల‌తో క‌న్‌స్ర్ట‌క్ష‌న్ అండ్ డిమాలిషింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఇసుక‌, కంక‌ర‌ను వివిధ సైజుల్లో వేరు చేసేలా రీసైక్లింగ్ ప్లాంట్‌ను నిర్మించారు. ఇసుక‌, కంక‌ర‌, ఇటుక‌ను పున‌ర్వినియోగ వ‌స్తువుగా మార్చేలా, గంట‌కు 50 ట‌న్నుల నిర్మాణ వ్య‌ర్థాల‌ను వేరు చేసేలా  సీ అండ్ డీ ప్లాంట్‌ను నిర్మాణం చేశారు. ట‌న్ను నిర్మాణ వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ రుసుమును రూ. 342గా నిర్ధారించారు.

రోజుకు 500 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల ఈ ప్లాంటును జీడిమెట్ల పారిశ్రామికవాడ ఫేజ్‌-6లోని 15 ఎకరాల విస్తీర్ణంలో జీహెచ్‌ఎంసీ, రాంకీ ఎన్విరో సంస్థ సంయుక్తాధ్వర్యంలో ఏర్పాటు చేశారు. జీహెచ్‌ఎంసీ స్థలాన్ని సమకూర్చగా, రాంకీ సంస్థ ప్లాంటును నెలకొల్పింది. నగరంలో ఇండ్లు కూల్చడం, మరమ్మతులు, రోడ్డు తవ్వకాల ద్వారా వచ్చే వ్యర్థాలను నిర్ణీత ఫీజు వసూలు చేసి ఇక్కడికి తరలించనున్నారు. ఇక్కడ ఆ వ్యర్థాల్లోని కంకర, మట్టి, ఇసుక తదితర వాటిని వేరు చేసి పేవ్‌మెంట్‌ టైల్స్‌, ఇటుకలు తయారు చేయనున్నారు. జవహర్‌నగర్‌, జీడిమెట్ల, ఫతుల్లాగూడ, కొత్వాల్‌గూడ, సచివాలయం తదితర చోట్లనుంచి ఇప్పటివరకు 13,14,791.11 మెట్రిక్‌ టన్నుల నిర్మాణ వ్యర్థాలను ప్లాంటుకు తరలించినట్లు రాంకీ వర్గాలు తెలిపాయి.