వచ్చే ఆరు నెలల్లో హెచ్‌సీఎల్‌లో 20 వేల ఉద్యోగాలు

న్యూఢిల్లీ, జనవరి 15: దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ భారీ స్థాయిలో ఉద్యోగులను నియమించుకోవడానికి సిద్ధిమైంది. గతేడాది కరోనా వైరస్‌ కారణంగా నియామకాలు అంతంత మాత్రమే చేపట్టిన సంస్థ.. వచ్చే ఆరు నెలల్లో ఏకంగా 20 వేల మంది సిబ్బందిని రిక్రూట్‌ చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. దేశీయ, అంతర్జాతీయంగా డిజిటల్‌ సేవలకు పెరుగుతున్న డిమాండ్‌తోపాటు అతిపెద్ద ఒప్పందాలు కుదుర్చుకోవడంతో వచ్చే ఆరు నెలల్లో 20 వేల మంది సిబ్బందిని నియమించుకోనున్నట్లు కంపెనీ సీఈవో విజయ కుమార్‌ వెల్లడించారు. నోయిడా కేంద్రస్థానంగా ఐటీ సేవలందిస్తున్న హెచ్‌సీఎల్‌.. గతేడాది 10 బిలియన్‌ డాలర్ల మైలురాయికి చేరుకున్నది. 1,59,682 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. గత త్రైమాసికంలో మొత్తంగా 12,422 మంది సిబ్బందిని రిక్రూట్‌ చేసుకుని నికరంగా 6,597 మంది తీసుకున్నది. గడిచిన ఏడాదికాలంలో వలసలు 10.2 శాతంగా ఉన్నాయి. డిమాండ్‌ దృష్ట్యా ఫ్రెషర్లు, నైపుణ్యం కలిగిన మరో 20 వేల మందిని రిక్రూట్‌ చేసుకోవాలని నిర్ణయించినట్లు ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా విజయ్‌ కుమార్‌ వెల్లడించారు. వీసాకు సంబంధించిన సమస్యలపై ఆయన స్పందిస్తూ.. అమెరికాలో విధులు నిర్వహిస్తున్నవారిలో 70% మంది అక్కడి స్థానికులేనని చెప్పారు.

క్యూ3లో 31 శాతం పెరిగిన లాభం

ఆర్థిక ఫలితాల్లో హెచ్‌సీఎల్‌ టెక్‌ విశ్లేషకుల అంచనాలకుమించి రాణించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల్లో సంస్థ రూ.3,982 కోట్ల లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో ఆర్జించిన రూ.3,037 కోట్లతో పోలిస్తే ఈసారి లాభంతో 31.1 శాతం ఎక్కువ. డిజిటల్‌ సేవలకు డిమాండ్‌ నెలకొనడం సంస్థకు కలిసొచ్చింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 6.4% ఎగబాకి రూ.19,302 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఇది రూ.18,135 కోట్లుగా ఉన్నది. ప్రస్తుత త్రైమాసికంలో ఆదాయంలో వృద్ధి 2-3 శాతం మధ్యలో ఉంటుందని అంచనావేసింది. అలాగే ప్రతి షేరుకు రూ.4 మధ్యంతర డివిడెండ్‌ను హెచ్‌సీఎల్‌ ప్రతిపాదించింది.