బ్లాక్ చెయిన్ తంటా..

న్యూఢిల్లీ: టెలికం స‌ర్వీస్ ప్రొవైడ‌ర్లు త‌మ యూజ‌ర్ల‌కు వాణిజ్య సందేశాల నియంత్రణకు అమ‌ల్లోకి తెచ్చిన కొత్త నిబంధ‌న‌ల‌తో ప‌లు సేవ‌ల‌కు తీవ్ర అంత‌రాయం ఏర్ప‌డింది. టెలికం కంపెనీలు సోమవారం నుంచి అమల్లోకి తెచ్చిన ఈ కొత్త నిబంధనల‌తో సోమవారం సాయంత్రానికి దాదాపు 40 శాతం సందేశాలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో నెట్‌బ్యాంకింగ్‌, క్రెడిట్‌ కార్డు చెల్లింపులు, రైల్వే టికెట్‌ బుకింగ్‌, ఈ-కామర్స్‌, ఆధార్‌ ధ్రువీకరణ, కొవిన్‌ దరఖాస్తు వంటి ఆన్‌లైన్‌ సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది.

త‌త్ఫ‌లితంగా ఎస్సెమ్మెస్‌, ఓటీపీ వంటి సందేశాలు కూడా టెలికం సంస్థ‌ల యూజ‌ర్లకు చేరలేదు.  టెలికం సంస్థ‌లు అమ‌లు చేసిన‌‌ కొత్త నిబంధనల్లో టెక్నిక‌ల్ సమస్యలు తలెత్తడమే ఈ గంద‌ర‌గోళానికి కార‌ణ‌మ‌ని తెలియ‌వ‌చ్చింది. దీంతో టెలికం కంపెనీలు, పేమెంట్‌ సహా ఇతర ఆర్థిక సంస్థల మ‌ధ్య పరస్పరం ఆరోపణల యుద్ధం సాగింది.

టెల్కోల తప్పిదం వల్లే ఈ సమస్య తలెత్తిందని పేమెంట్‌ సంస్థలు ఆరోపించాయి. కానీ త‌మ‌ కొత్త నిబంధనల్ని అమలు చేసే ప్రక్రియలో కంపెనీలు చేసిన తప్పిదం వ‌ల్ల‌ అంతరాయం ఏర్ప‌డింద‌ని టెల్కోలు ప్ర‌త్యారోప‌ణ‌ల‌కు దిగాయి. సందేశాలు పంపేవారి ఐడీలను కొత్తగా తెచ్చిన బ్లాక్‌చైన్‌ ప్లాట్‌ఫాంపై రిజిస్టర్‌ చేయకపోవడం వల్లే సందేశాలు వెళ్లలేదని పేర్కొన్నాయి.

వాణిజ్య సందేశాల నియంత్రణకు 2018లో ట్రాయ్ జారీ చేసిన కొత్త నిబంధనలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. కొత్త నియమాల ప్రకారం.. టెలికం సంస్థ‌లు ప్రతి ఎస్‌ఎంఎస్ లక్షిత వినియోగదారుడికి పంపే ముందు రిజిస్టర్డ్ మెసేజ్‌తో సరిపోల్చుకుని ధ్రువీక‌రించుకోవాలి.

ట్రాయ్ జారీ చేసిన ఈ నిబంధ‌న‌ల అమ‌లుకు టెలికం సంస్థ‌లు బ్లాక్‌చైన్‌ సాంకేతికతను అమల్లోకి తెచ్చాయి. దీంట్లో రిజిస్టర్‌ అయిన ఐడీల నుంచి వచ్చిన సందేశాలను మాత్రమే ధ్రువీకరించుకొని వినియోగదారుడికి పంపుతాయి టెలికం సంస్థ‌లు. రిజిస్టర్‌ కాని ఐడీల నుంచి వచ్చే సందేశాల్ని నిలిపివేస్తాయి.