అమ్మతనాన్ని చాటిన మహిళా కానిస్టేబుల్

ఉప్పల్‌ :నాచారం బాబానగర్‌కు చెందిన స్వాతి అలియాస్‌ మహేశ్వరీ(21) ఏడాది కాలంగా మతిస్థితిమితం సరిగాలేక చిన్న శిశువుతో రోడ్లపై తిరుగుతూ, రాళ్లను విసురుతూ ఇబ్బంది పెడుతున్నది. మానసిక స్థితి సరిగాలేని ఆ మహిళతో కుటుంబసభ్యులు దూరంగా ఉంటున్నారు. మతిస్థిమితం సరిగాలేక ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న మహిళను నాచారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న మహిళపై నాచారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈమేరకు మహిళను ఎర్రగడ్డలోని మానసిక చికిత్సాలయానికి తరలించి, అదేవిధంగా మూడునెలల పసిపాపను శిశువిహార్‌లో చేర్పించారు.

పాలు పట్టిన మహిళా కానిస్టేబుల్స్‌..

ఈ సందర్భంగా శిశువుకు నాచారం మహిళా కానిస్టేబుళ్లు తగిన సహకారం అందించారు. పాల డబ్బాలను తెప్పించి, పాలు పట్టించారు. శిశువును శిశువిహార్‌కు అప్పగించే వరకు సంరక్షించి, తగిన సపర్యలు చేశారు.

ట్రాఫిక్‌ పోలీసుల సేవలు

ట్రాఫిక్‌ సిగ్నల్స్‌, రోడ్డును దాటడంలో ఇబ్బందులు పడుతున్న వృద్ధుడికి ట్రాఫిక్‌ పోలీసులు అండగా నిలిచారు. ఉప్పల్‌ రింగ్‌రోడ్డులో ఓ వృద్ధుడు రోడ్డు దాటడంలో  పోలీసులు సహాయం అందించారు. ఉప్పల్‌లో పనిచేస్తున్న ట్రాఫిక్‌ మహిళా కానిస్టేబుల్‌ కుమారి సంధ్య తోడ్పాటు అందించి, వృద్ధుడిని రోడ్డు దాటించారు. ఉప్పల్‌ రింగ్‌రోడ్డులో మహిళా కానిస్టేబుల్‌ సంధ్య చేస్తున్న సేవలను ఉన్నతాధికారులు ప్రశంసించారు.