అసాంజేను అమెరికాకు అప్పగించొద్దన్న బ్రిటిష్‌ కోర్టు న్యాయమూర్తి తీర్పు

లండన్‌: వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు జూలియా అసాంజేను అమెరికాకు అప్పగించవద్దని ఓ బ్రిటిష్‌ కోర్టు న్యాయమూర్తి సోమవారం తీర్పు చెప్పారు. నిఘా చట్టాలను ఉల్లంఘించి ప్రభుత్వ కంప్యూటర్లను హ్యాక్‌ చేయడానికి కుట్ర పన్నారని అసాంజేపై అభియోగం. అయితే, ఆయనను అమెరికాకు అప్పగించడానికి జిల్లా న్యాయమూర్తి వానెస్సా బారిస్టర్‌ నిరాకరించారు.

ఒకవేళ అమెరికాకు అప్పగిస్తే అసాంజే ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉందని వానెస్సా ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా మిలిటరీ రహస్యాలను బహిర్గతం చేశారని ఆయనపై అభియోగాలు ఉన్నాయి. అసాంజేపై అమెరికా ప్రాసిక్యూటర్లు 17 గూడఛర్య అభియోగాలతోపాటు కంప్యూటర్‌ దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపించారు. ఈ ఆరోపణలు రుజువైతే అసాంజేకు గరిష్ఠంగా 175 సంవత్సరాల జైలుశిక్ష పడుతుంది. 2010లో అమెరికా మిలిటరీ రహస్య కార్యకలాపాలపై వికీలీక్స్‌లో ఆయన బహిర్గతం చేసిన సమాచారం సంచలనాలు కలిగించింది.

అసాంజే కేసు క్రమంబెట్టిదనిన..

ఏప్రిల్‌ 2010: ఇరాక్‌, ఆఫ్ఘనిస్థాన్‌లలో అమెరికా మిలిటరీ రహస్యాలను ప్రచురించిన వికీలీక్స్‌.

ఆగస్టు 2010: లైంగిక దాడి, వేధింపుల అంశాలపై రెండు వేర్వేరు అభియోగాలపై అసాంజేను ప్రశ్నించిన స్వీడన్‌ పోలీసులు.

నవంబర్‌ 2011:  అసాంజే అప్పగింత కోసం అంతర్జాతీయ అరెస్ట్‌ వారంట్‌ జారీ చేసిన స్వీడన్‌.

డిసెంబర్‌ 2011: లండన్‌ పోలీసుల ముందు అసాంజే లొంగుబాటు. షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు.

మే 2012: అసాంజేను స్వీడన్‌కు అప్పగించాలని బ్రిటన్‌ సుప్రీంకోర్టు తీర్పు

జూన్‌ 2012: లండన్‌లోని ఈక్వెడార్‌ ఎంబసీలోకి ప్రవేశించి రాజకీయ ఆశ్రయం కోరిన అసాంజే.

ఆగస్టు 2013: అసాంజేకు రాజకీయ ఆశ్రయం కల్పించిన ఈక్వెడార్‌.

మే 2017: అసాంజేపై దర్యాప్తు ఉపసంహరించుకున్న స్వీడన్‌. కోర్టు విచారణకు హాజరు కానందుకు వారంట్ జారీ చేసిన బ్రిటన్‌.

డిసెంబర్‌ 2017: అసాంజేకు పౌరసత్వం మంజూరు చేసిన ఈక్వెడార్‌. మిలిటరీ రహస్యాలు లీక్‌ చేశారని అసాంజేపై అభియోగాలు. ఫిబ్రవరి 2018: బెయిల్‌ నిబంధనలను పాటించనందుకు అసాంజేకు జారీ అయిన అరెస్ట్‌ వారంట్‌ను ధ్రువీకరించిన లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు.

ఏప్రిల్‌ 2019: కోర్టులో హాజరు కానందుకు అమెరికా అధికారుల తరఫున ఈక్వెడార్‌ ఎంబసీ వద్ద అసాంజే అరెస్ట్‌.

ఫిబ్రవరి 2020: అసాంజేపై వేధింపులు నిలిపివేసి, వైద్యపరమైన నిర్లక్ష్యాన్ని వీడాలని 117 మంది వైద్యుల బహిరంగ లేఖ.లండన్‌లోని వూల్‌విచ్‌ క్రౌన్‌ కోర్టు కేసులో అసాంజే అప్పగింత కేసు విచారణ ప్రారంభం.

సెప్టెంబర్‌ 2020: అసాంజేకు మద్దతుగా బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌కు బహిరంగలేఖ రాసిన 160 మంది ప్రముఖులు.

అక్టోబర్‌ 2020 ఒకటో తేదీ: 2021 జనవరి నాలుగో తేదీన ఆదేశాలు జారీ చేస్తామని ప్రకటించిన జడ్జి వానెస్సా బారిస్టర్‌.

డిసెంబర్‌ 2020: అసాంజేకు క్షమాభిక్ష ప్రసాదించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు విజ్ఞప్తి చేసిన అసాంజే భాగస్వామి స్టెల్లా మొర్రీస్‌.