నిజామాబాద్ ఎంపీ దిష్టి బొమ్మలు దహనం

నిజామాబాద్ : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన బీజేపీ ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్‌పై టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. నిజామాబాద్ పట్ట‌ణంలోని ధ‌ర్నాచౌక్ వ‌ద్ద టీఆర్ఎస్వీ ఆధ్వ‌ర్యంలో అర‌వింద్ దిష్టిబొమ్మ‌ను ద‌హ‌నం చేశారు. జ‌గిత్యాల జిల్లాలోని మెట్‌ప‌ల్లి పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద అరవింద్ దిష్టిబొమ్మను టీఆర్ఎస్ నాయ‌కులు ద‌హ‌నం చేశారు.

నిజామాబాద్‌ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలుపొందిన ఎమ్మెల్సీ కవితపై బీజేపీ నాయకులు ఓర్వలేకే తప్పుడు ప్రచారానికి దిగుతున్నారని టీఆర్ఎస్ నాయ‌కులు ధ్వ‌జ‌మెత్తారు. మహిళ అని చూడకుండా కించపరుస్తూ మాట్లాడిన అర్వింద్‌ మహిళా జాతిని అవమానించారని దుయ్యబట్టారు. ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతున్న అర్వింద్‌ను తెలంగాణ మహిళలు క్షమించరని, ఆయనను తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ధ్వజమెత్తారు.

 

ఎంపీగా చేసిన సేవలతో  నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో ప్రజల గుండెల్లో  కవిత నిలిచారని, తమ ఇంటి ఆడబిడ్డగా ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీగా గెలుపొందాక నిజామాబాద్‌, జగిత్యాల జిల్లాల్లో విస్త్రృతంగా పర్యటిస్తున్న కవితపై సోషల్‌ మీడియా వేదికగా బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారానికి దిగుతుండడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. సోషల్‌ మీడియాలో ఎమ్మెల్సీ కవితపై  ఎంపీ అర్వింద్‌ వ్యక్తిగత దూషణలు చేస్తూ పైశాచికానందం పొందుతున్నారని, ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసిన ప్రజల నుంచి, ప్రజాసేవ నుంచి కవితను విడదీయలేరన్నారు. ఎంపీ అర్వింద్‌ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.