గూగుల్ లో ఎక్కువగా వెతికింది వీళ్ళనే…

జో బైడెన్‌

ఈ ఏడాదిలో భారతదేశంలో ఎక్కువగా అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడైన్‌ గురించి నెటిజన్లు సెర్చ్‌ చేశారు. దేశంలో అత్యధికంగా శోధించిన వ్యక్తుల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. డెమొక్రటిక్‌ పార్టీకి చెందిన బైడైన్‌ నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డోనాల్‌ ట్రంప్‌ను ఓడించారు. 538 ఎలక్టోరల్‌ ఓట్లు ఉన్న అమెరికాలో 306 ఓట్లు సాధించారు. వచ్చే ఏడాది జనవరిలో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

అర్నాబ్ గోస్వామి

అర్నాబ్ గోస్వామి. ఈ పేరు తెలియని వారుండరు. రిపబ్లిక్ న్యూస్ నెట్‌వర్క్ మేనేజింగ్ డైరెక్టర్. 2018లో 53 ఏండ్ల ఇంటీరియ‌ర్ డిజైన‌ర్ అన్వే నాయక్, ఆయన తల్లి కుముద్ నాయక్ ఆత్మహత్య కేసులో మహారాష్ట్ర పోలీసులు నవంబర్‌ 4న అరెస్టు చేశారు. రిప‌బ్లిక్ టీవీ బ‌కాయిలు చెల్లించ‌క‌పోవ‌డంతోనే తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన కుమార్తె పలుసార్లు ఫిర్యాదు చేయడంతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణంపై మహారాష్ట్ర ప్రభుత్వం, ముంబై పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. అలాగే టీవీ రేటింగ్స్‌ కుంభకోణంలోనూ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు.

కనికా కపూర్‌

బేబిడా‌ల్‌ సింగర్‌గా బాలీవుడ్‌లో గుర్తింపు పొందిన కనికా కపూర్‌ కరోనా మహమ్మారితో ఆమె పేరు మార్మోగింది. ఏప్రిల్‌లో లండన్‌కు వెళ్లి వచ్చింది. తనకు కరోనా సోకిన విషయం తెలియని ఆమె అంతకంటే ముందుగానే ఇతర సినీ, రాజకీయ ప్రముఖులు హాజరైన ఓ విందులో పాల్గొనడం వివాదాస్పదమైంది. కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించారని కేసు నమోదు కావడం తదితర ఘటనలు ఆమెను వార్తల్లో నిలిచేలా చేశాయి. అయితే ఆమె కరోనా మహమ్మారితో తీవ్ర అవస్థతకు గురైన ఆమె.. ఎట్టకేలకు కోలుకుంది.. ఈ క్రమంలో గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన వ్యక్తుల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది.

కిమ్‌ జోంగ్‌ ఉన్

కిమ్ జోంగ్ ఉన్. ఆ పేరే సంచలనం. ఆయన ఏం చేసినా.. ఏం మాట్లాడినా అంచనాలకు మించి సంచలనాలు సృష్టిస్తారు. కిమ్ జోంగ్ ఉన్‌కు ప్రపంచంలో అత్యంత భయంకరమైన నియంత అనే పేరుంది. అనారోగ్యానికి గురయ్యాడని, చనిపోయాంటూ పెద్ద ఎత్తున వార్తలు వ్యాపించాయి. ఈ క్రమంలో ఆయన వార్తలో వ్యక్తిగా నిలిచారు. కిమ్‌ ఆరోగ్య పరిస్థితిపై చాలా రోజుల పాటు ఊహాగానాలు వినిపించాయి. ఈ వార్తలన్నింటికి తెరదించుతూ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ వార్తలతో కిమ్‌ టాప్‌-10 జాబితాలో నాలుగో స్థానంలో నిలిచారు.

 అమితాబ్ బచ్చన్

అమితాబ్ బచ్చన్. పరిచయం అవసరం లేని పేరు. దేశంలో అత్యంత గౌరవనీయమైన సీనియర్ నటుల్లో ఒకరు. జూలైలో తన కుమారుడు అభిషేక్ బచ్చన్‌తో కలిసి కొవిడ్-19 పాజిటివ్‌గా పరీక్షించారు. దీంతో ఆయన ముంబైలోని నానావతి హాస్పిటల్‌లో చికిత్స తీసుకొని కోలుకున్నారు. కరోనా మహమ్మారితో ఆయన గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపారు.

రషీద్ ఖాన్

రషీద్ ఖాన్ ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన క్రికెట్‌. ఇటీవల ఓ చిత్రమైన సంఘనటతో గూగుల్‌లో టాప్‌-10 సెర్చ్‌ జాబితాలో చేరాడు. రషీద్‌ ఖాన్‌ భార్య పేరు గూగుల్‌లో సెర్చ్‌ చేయగా.. భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ భార్య అనుష్మ శర్మ పేరు వచ్చింది. దీంతో అటు విరాట్‌, ఇటు అనుష్క శర్మ అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. వాస్తవానికి రషీద్‌ ఖాన్‌కు పెళ్లే కాలేదు. 2018లో రెడ్‌ ఎఫ్‌ఎంతో చాట్‌ చేస్తున్నప్పుడు తన అభిమాన హీరోయిన్లు అనుష్క శర్మ, ప్రీతి జింతా అని, అభిమాన హీరో అమీర్‌ఖాన్‌ అని చెప్పాడు. అప్పటి నుంచి గూగుల్‌లో రషీద్‌ఖాన్‌ వైఫ్‌ అని కొట్టగానే అనుష్క శర్మ పేరు చూపించింది. దీంతో రషీద్‌ఖాన్‌ వార్తలో వ్యక్తిగా నిలిచి.. టాప్‌-6లో నిలిచాడు.

రియా చక్రవర్తి

సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో రియా చక్రవర్తి పేరు ప్రముఖంగా వినిపించింది. సుశాంత్‌ సింగ్‌ది హత్యేనని.. అందులో రియా చక్రవర్తి, మహేష్ భట్, సల్మాన్ ఖాన్ సన్నిహితులున్నారని, దిశ సలియాన్ మరణంతో సంబంధం ఉందంటూ.. వార్తలు వచ్చాయి. ఈ కేసు విచారణలో ఉండగానే.. డ్రగ్స్ కేసులో నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. దక్షిణ ముంబైలోని బైకుల్లా జైలులో నెల రోజులున్న ఆమె.. అక్టోబర్‌ 7న బెయిల్‌పై బయటకు వచ్చింది. ఈ కారణంతో ఆమె గురించి వెతికేందుకు నెటిజన్లు ఆసక్తి చూపారు. తద్వారా గూగుల్‌ మోస్ట్‌ సెర్చ్‌ పర్సనాలిటీ జాబితాలో టాప్‌-10లో ఏడోస్థానంలో నిలిచింది.

కమలా హారిస్

కమలా హారిస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు కొత్తగా ఎన్నికైన ఉపాధ్యక్షురాలు. నవంబర్‌ జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఉపాధ్యక్ష పదవిని చేజిక్కించుకుంది. అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళగా, తొలి నల్ల జాతీయురాలిగా, తొలి ప్రవాస భారతీయురాలిగా ఇలా ఎన్నో ప్రత్యేకతలను సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలో భారత్‌లోని తమిళనాడు మూలాలున్న ఆమె గురించి తెలుసుకునేందుకు భారతీయ నెటిజన్లు ఎక్కువగా గూగుల్‌లో సెర్చ్‌ చేశారు. ఈ క్రమంలో గూగుల్‌లో ఈ ఏడాదిలో టాప్‌-8 ప్లేస్‌లో నిలిచారు.

అంకిత లోఖండే

‘పవిత్ర రిష్తా’ టీవీ సీరియల్‌తో అంకిత ఎంతో గుర్తింపు సాధించింది. బాలీవుడ్‌ బుల్లితెరకు సంబంధించి అత్యధిక పారితోషకం తీసుకునే తారల్లో ఈమె ఒకరు. ‘మణికర్ణిక, బాఘీ-3 సినిమాల్లోనూ నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఈ క్రమంలో ఆమె సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్య తర్వాత అంకిత పేరు మార్మోగింది. పవిత్ర రిష్తా సీరియల్‌లో సుశాంత్‌తో కలిసి నటించింది. ఈ సమయంలో వారిద్దరు ప్రేమలో పడ్డారని, ఆ తర్వాత విడిపోయారని వార్తలు రావడంతో వార్తలోని వ్యక్తిగా నిలిచారు. సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్య తర్వాత అంకిత తన బాధను వ్యక్తం చేయడంతో పాటు.. ‘జస్టిస్‌ ఫర్‌ సుశాంత్‌’ పేరుతో సామాజిక మాధ్యమాల్లోనూ పోస్టులు పెట్టింది. ఈ క్రమంలో ఆమెకు అభిమానులు మద్దతు తెలుపడంతో పాటు.. మద్దతు ఇచ్చారు. ఇలా ఈ ఏడాదిలో టాప్‌ 10 జాబితాలో 9వ స్థానంలో నిలిచింది.

కంగనా రనౌత్

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌గా కంగనా రనౌత్‌. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌ ఉంటూ సమాజంలో జరిగే అన్ని విషయాలపై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వ్యక్తం చేస్తూ ఉంటుంది. బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్యకు కారణం బాలీవుడ్‌ పెద్దలేనంటూ విమర్శలు గుప్పించింది. ఆమె చేసిన బంధుప్రీతిపై చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చకు తెరలేపాయి. అలాగే ఆత్మహత్య కేసును సరిగా విచారించడం లేదంటూ ముంబై పోలీసులను విమర్శించడం.. మహారాష్ట్రను పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌తో పోల్చడం, ప్రభుత్వంతో వాదోపవాదాలకు దిగింది. ఆమె నిబంధనలకు విరుద్ధంగా బాంద్రాలో కార్యాలయం నిర్మించారంటూ కొంత భాగాన్ని బీఎంసీ అధికారులు కూల్చివేశారు. అయితే ఉద్దేశపూర్వకంగానే కంగనా ఆఫీసును కూల్చివేశారని ముంబై కోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఇలా తన గురించి మాట్లాడుకునేలా చేసిన బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ టాప్‌-10 జాబితాలో పదో స్థానంలో నిలిచింది.