రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్వాస సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షించారు.‘మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్జీ శ్వాసకోశ సమస్యలతో దవాఖానలో చికిత్స పొందుతున్నారని తెలిసి ఆందోళనకు గురయ్యాను. ఆయన వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో బుద్ధదేవ్ గత సోమవారం కోల్‌కతాలోని ఉడ్‌లాండ్ దవాఖానలో చేరారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. శరీరంలో ఆక్సిజన్ స్థాయి 70 దిగువకు పడిపోయాయని డాక్టర్లు తెలిపారు. దీంతో ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించారని, ఫలితాలు ఇంకా రాలేదని వెల్లడించారు.భట్టాచార్జీ 2001 నుంచి 2011 వరకు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2011లో జరిగిన ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో 34 ఏండ్ల కమ్యూనిస్ట్‌పాలనకు బ్రేక్ పడింది.
