జైపూర్ : ఈ నెల 18వ తేదీ నుంచి విద్యాసంస్థలను తెరవాలని రాజస్థాన్ ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు తొమ్మిది నెలల విరామం తర్వాత అన్ని రకాల విద్యాసంస్థలను తెరిచేందుకు నిర్ణయించామని ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తెలిపారు. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, కోచింగ్ సెంటర్లు, ప్రభుత్వ శిక్షణా కేంద్రాల్లో 50 శాతం విద్యార్థులతో తరగతులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతానికి 9వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులకు క్లాసులు నిర్వహిస్తామన్నారు. దిగువ తరగతి విద్యార్థులకు స్కూళ్లలోకి అనుమతించమని చెప్పారు. ఇక డిగ్రీ స్థాయిలో చివరి సంవత్సరం విద్యార్థులకు మాత్రమే క్లాసులు ఉంటాయని స్పష్టం చేశారు. కొన్ని జిల్లాల్లో కేసులు నమోదు కావడం లేదని, రాష్ర్ట వ్యాప్తంగా రికవరీ రేటు 96.31 శాతానికి చేరిందన్నారు. గత నెలతో పోల్చితే ప్రస్తుతం పరిస్థితి మెరుగ్గా ఉందన్నారు సీఎం. కరోనా వైరస్ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై టీచర్లకు ఆరోగ్య శాఖ అధికారులతో అవగాహన తరగతులు ఏర్పాటు చేస్తామన్నారు. కరోనా వ్యాక్సిన్ వారం పది రోజుల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున జనవరి 11 నుంచి మెడికల్, డెంటల్, నర్సింగ్ కాలేజీలను ఓపెన్ చేస్తామన్నారు.
