రేపు శాటిలైట్‌ బస్‌ టెర్మినల్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న మంత్రి కేటీఆర్‌

హైదరబాద్‌ : దేశంలోనే తొలి ఏసీ శాటిలైట్‌ బస్‌ టెర్మినల్‌ నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. ఎల్‌బీనగర్‌ వనస్థలిపురం జింకల పార్కు సమీపంలో బస్‌ టెర్మినల్‌ నిర్మాణానికి శనివారం మధ్యాహ్నం ఒంటి గంట 15 నిమిషాలకు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేయనున్నారు. తొలిదశలో రూ. 10 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణ పనులు చేపట్టనున్నారు. అంతర్‌ జిల్లాల బస్సుల రాకపోకల కోసం ఈ బస్‌ టెర్మినల్‌ను నిర్మిస్తున్నారు. ఎల్‌బీనగర్‌ మీదుగా ఏపీతోపాటు తెలంగాణలోని ఖమ్మం, భద్రాచలం, నల్లగొండ, సూర్యాపేటకు రోజూ సుమారు 20 వేల నుంచి 25 వేల మంది ప్రయాణికులు వెళ్తుంటారు.ఇక్కడ బస్సులు రోడ్డుపై ఆగి విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్నది. దీంతో సుమారు 680 మీటర్ల వరకు అధునాతన బస్‌ బేలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలిదశలో హెచ్‌ఎండీఏ 3 బస్‌ బేలను నిర్మించనుంది. ప్రతి బస్‌ బేలో ఏసీతో కూడిన వెయిటింగ్‌ రూంలతోపాటు ఫార్మసీ, బ్యాంకు, నీటి ఏటీఎంలు, ఎంక్వైరీ కేంద్రం, ఫుడ్‌ కోర్టులు, మరుగుదొడ్లు, బైకులు, కార్లు, ట్రక్కులకు పార్కింగ్‌ కేంద్రాలతోపాటు లోకల్‌ బస్టాప్‌లను ఏర్పాటు చేస్తారు. ఆరు నెలల్లోగా పనులు పూర్తిచేయాలని హెచ్‌ఎండీఏ లక్ష్యంగా పెట్టుకున్నది.