ఈ నెల 28వ తేదీ (సోమవారం) నుంచి వచ్చేనెల (జనవరి-2021) వరకు రాష్ట్రంలోని రైతులందరికీ రైతుబంధు పథకం కింద ఆర్థిక సహాయం అందించనున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు వెల్లడించారు. రైతుబంధు నగదు పంపిణీపై ముఖ్యమంత్రి ఇవాళ ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించారు. 61.49 లక్షల మంది రైతులకు చెందిన 1.52 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములకు ఎకరానికి రూ.5 వేల చొప్పున 2020 యాసంగి సీజన్ కోసం రూ.7,515 కోట్లు పంటసాయంగా అందిస్తున్నట్లు సీఎం చెప్పారు. రాష్ట్రంలోని ఏ ఒక్క రైతూ మిగలకుండా ప్రతి ఎకరానికీ డబ్బులు నేరుగా బ్యాంకులో జమ చేయాలని అధికారులను ఆదేశించారు.సమావేశంలో మంత్రులు శ్రీ కేటీఆర్, శ్రీ ఎస్. నిరంజన్ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు శ్రీ వినోద్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు శ్రీ రాజీవ్ శర్మ, సీఎస్ శ్రీ సోమేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
