రేవంత్ రెడ్డి చుట్టూ కాంగ్రెస్ రాజకీయం,కారణాలు అవేనా?

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యమైన విజయం సాధించడం కాంగ్రెస్ మరింత పతనావస్థకు చేరుకోవడంతో ఆ పార్టీ నష్టనివారణ చర్యలు ప్రారంభించింది. టీపీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో కొత్త పీసీసీ చీఫ్‌ను ఎన్నుకోక తప్పని పరిస్థితి నెలకొంది. అయితే మొదటి నుంచి ఈ రేసులో ముందున్న రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ పదవి ఇచ్చే విషయంలో కాంగ్రెస్ అధిష్టానం విముఖత చూపుతున్నట్టు తెలుస్తుంది.కొత్త పీసీసీ చీఫ్‌ను ఎంపిక చేసేందుకు తెలంగాణకు వచ్చిన ఆ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్.. దీనిపై పార్టీ ముఖ్యనేతలు, జిల్లా అధ్యక్షుల అభిప్రాయాలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం టీపీసీసీ చీఫ్ ఎంపిక అంతా గతానికి భిన్నంగా సాగుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. టీపీసీసీ చీఫ్ పదవిని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి ఇవ్వడమా ? లేక మరొకరికి ఇవ్వడమా అనే అంశంపైనే కాంగ్రెస్‌లో చర్చ సాగుతోంది.రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ పదవి ఇస్తేనే తెలంగాణలో పార్టీ బతుకుతుందని కొందరు నేతలు బలంగా వాదిస్తుంటే మరికొందరు మాత్రం ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు వంటి వారికి టీపీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని అధిష్టానంపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. అయితే టీపీసీసీ చీఫ్ పదవిని ఎవరికి ఇచ్చినా మరో వర్గం నేతలు బీజేపీ వైపు వెళ్లే అవకాశం ఉండటంతో అందరినీ ఒప్పించి ఈ పదవికి నాయకుడిని ఎంపిక చేయాలనే యోచనలో కాంగ్రెస్ నాయకత్వం ఉన్నట్టు తెలుస్తోంది.దీంతో ఇప్పటికప్పుడు కొత్త టీపీసీసీ చీఫ్‌ ఎంపిక ఉంటుందా ? లేక ఈ అంశాన్ని మరికొంతకాలం నాన్చుతారా ? అనే చర్చ కూడా మొదలైంది. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు రేవంత్ రెడ్డి చుట్టూనే తిరుగుతున్నాయనే విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. అయితే రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ పదవి దక్కకపోతే ఆయన ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారన్నది కూడా ఆసక్తికరంగా మారింది. చూస్తుంటే కష్టాల్లో ఉన్న కాంగ్రెస్‌ను టీపీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ మరింత ఇబ్బందుల్లోకి నెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

 

 

 

 

 

 

 

contentsource:telugu.news18.com