జైపూర్,తీస్మార్ న్యూస్: రాజస్థాన్ గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇటీవల పైచేయి సాధించిన బీజేపీ నగరపాలికలు, మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో చతికిలపడింది. అధికార కాంగ్రెస్ పార్టీ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. మొత్తం 12 జిల్లాల్లోని 50 నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగగా బీజేపీ కేవలం నాలుగు మున్సిపాలిటీలను మాత్రమే దక్కించుకోగలిగింది. అధికార కాంగ్రెస్ 17 మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో జయకేతనం ఎగురవేసింది. మరో 24 చోట్ల ఇండిపెండెంట్లతో కలిసి బోర్డులను సొంతం చేసుకున్నారు.అంటే మొత్తం 50 నగరపాలక సంస్థల్లో 41 చోట్ల కాంగ్రెస్ అధికారం దక్కించుకుంది. ఇక, 50 మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల పరిధిలో మొత్తం 1,775 వార్డులకు ఎన్నికలు జరుగగా కాంగ్రెస్ అత్యధికంగా 619 వార్డులు గెలుచుకుంది. ఇండిపెండెంట్లు 595 వార్డులతో రెండో స్థానంలో నిలిచారు. బీజేపీ 549 వార్డులతో మూడో స్థానానికి పరిమితమైంది.
