పవర్ స్టార్ కన్నుమూత

ప్రముఖ నటుడు ఇకలేరు. తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. జిమ్‌ చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన్ను బెంగళూరులోని విక్రమ్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు. పునీత్‌ ఇకలేరన్న వార్త విని ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. భారీగా ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు.
పునీత్‌ రాజ్‌కుమార్‌ బాలనటుడిగా సుమారు 14 సినిమాల్లో నటించారు. 2002లో ‘అప్పు’ (తెలుగులో ‘ఇడియట్’)తో కథానాయకుడిగా మారారు. ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోయారు పునీత్‌. ‘వీర కన్నడిత’, ‘అరసు’, ‘మిలనా’, ‘వంశీ’, ‘రాజ్‌’, ‘జాకీ’, ‘హుడుగరు’, ‘అన్నా బాండ్‌’, ‘యారే కూగడాలి’, ‘పవర్‌’, ‘దొడ్డమానే హుడుగ’, ‘రాజకుమార’, ‘యువరత్న’ తదితర సినిమాలతో మాస్‌ హీరోగా పేరు తెచ్చుకున్నాడు పునీత్‌ రాజ్‌కుమార్‌. నటన మాత్రమే కాకుండా నిర్మాతగానూ సినిమాలు రూపొందించారు. డ్యాన్స్‌ ఆధారిత టీవీ కార్యక్రమాలకు హోస్ట్‌గా కూడా వ్యవహరించారు.

మరోవైపు క‌ర్ణాట‌క రాష్ట్రవ్యాప్తంగా హైఅల‌ర్ట్ ప్రకటించారు. ఆస్పత్రి ఆవరణతోపాటు ప్రధాన మార్గాల్లో పోలీసు బందోబస్తు పెంచారు. రెండు రోజులపాటు సినిమా థియేటర్లు మూసివేయాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.