తుమ్ము తెచ్చిన తంటా

తుమ్మే సమయంలో కండ్లు మూసుకోవాలి. లేదంటే కనుగుడ్లు బయటకు వస్తాయని చాలా మంది అంటుంటారు. తుమ్ముకు, కనుగుడ్లకు ఎలాంటి సంబంధం లేదు. కండ్లు తెరిచి తుమ్మడం వలన కనుగుడ్లు బయటకు వచ్చే అవకాశాలు లేవంటున్నారు వైద్యనిపుణులు. అయితే, తుమ్మే సమయంలో కాస్తా ఏమరుపాటుగా ఉన్నా.. దవాఖాన పాలై మందులు మింగాల్సిన పరిస్థితి వస్తుంది. ఓ 34 ఏండ్ల సంపూర్ణ ఆరోగ్యకరమైన ఓ వ్యక్తి తుమ్మును నిరోధించడానికి ప్రయత్నించే సమయంలో తన రెండు చేతులతో నోరు, ముక్కును మూసుకున్నాడు. దాంతో అతని  మెడలోని ఎముకలు పటపటమంటూ విరిగిపోయాయి. ఈ సంఘటన పోర్చుగల్‌లో జరిగింది. దాంతో సదరు యువకుడిని చికిత్స నిమిత్తం దవాఖాన ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్‌లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. రోగి తన ముక్కును గట్టిగా పట్టుకుని తుమ్ముతున్నప్పుడు నోరు మూసుకోవడంతో మెడలో “ఆకస్మికంగా ఎముకలు విరిగిపోయిన శబ్దం” వచ్చిందని వైద్యులు తెలిపారు. ఫలితంగా విపరీతమైన వాంతులు, భారీగా దగ్గు, గొంతులో నొప్పి, మింగడంలో సమస్య, శబ్దంలో మార్పులు వచ్చినట్లు గుర్తించారు. మెడ భాగంలోని ఎముకలు పక్కకు కదిలి విరగడంతోపాటు లోతైన కణజాలం, కండరాల లోపల గాలి బుడగలు వచ్చినట్లు వైద్యులు కనుగొన్నారు.గాలి నిండిన కణజాలానికి వ్యతిరేకంగా గుండె కొట్టుకున్నప్పుడు కూడా ఎముకల పగుళ్లు ఏర్పడుతున్నందున వైద్యులు అతని మృధువైన మెడ కణజాలం, ఛాతీని స్కాన్ చేయాలని ఆదేశించారు. అదృష్టవశాత్తూ, ఆ వ్యక్తి ఇప్పుడిప్పుడే దవాఖానలో కోలుకుంటున్నాడు. ముందు జాగ్రత్త చర్యగా అతనికి ఫీడింగ్ ట్యూబ్‌తోపాటు ఇంట్రావీనస్ యాంటీబయాటిక్స్ ఇచ్చారు. జీవితంలో ఎప్పుడైనా తుమ్మేటప్పుడు ముక్కును మూసుకోవడం చేయవద్దంటూ వైద్యులు సలహా ఇస్తున్నారు.