హైదరాబాద్ సిటీ బ్యూరో: హెల్మెట్ లేకుండా బైక్ నడుపడం ఇక కుదరదు. పోలీసులు ఆపడంతోపాటు, హెల్మెట్ తెచ్చుకునే వరకు బైక్ ఇవ్వరు. ఒక్క ప్రమాద మరణం కూడా సంభవించొద్దనే ఉద్దేశంతోనే సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు జనవరి 1 నుంచి ఈ నిర్ణయం తీసుకున్నారు. కమిషనరేట్ పరిధిలో ఏడు చోట్ల ప్రత్యేక చెక్‌పోస్టులు పెట్టి ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ ఏడు చోట్ల 24/7 పోలీసుల పర్యవేక్షణ ఉంటుంది. వాహనం నడిపేవారే కాకుండా పిలెన్ రైడర్ (ద్విచక్రవాహనం వెనుకాల కూర్చున్న వ్యక్తి) కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిందే. ఇకపై ఫొటోలు తీసి జరిమానా చెల్లించాలంటూ నోటీసులు పంపడం, చెకింగ్ సందర్భంగా వాహనాలను ఆపి చలానా రాయడం ఉండదు. కొత్తగా ఏర్పాటు చేసిన ఏడు చెక్‌పోస్టుల వద్ద ఉండే అధికారులు.. హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపేవారిని గుర్తించి ఆపుతారు. తర్వాత వారి వాహనాన్ని స్వాధీనం చేసుకుంటారు. హెల్మెట్ తీసుకొస్తేనే వాహనం ఇస్తారు.
ప్రమాద మరణాలు తగ్గించడమే లక్ష్యం
గతేడాది నిబంధనల అమలుతో దాదాపు 27% రోడ్డు ప్రమాదాల్లో మరణాలు తగ్గాయి. 2019తో పోల్చుకుంటే దాదాపు 200 మంది వాహనదారుల ప్రాణాలు గాలిలో కలిసిపోకుండా నిలబడ్డాయి. 2020లో జరిగిన రోడ్డు ప్రమాదాలను ఆధ్యయనం చేసినప్పుడు రాజీవ్ రహదారి, ఎన్‌హెచ్ 44, ఎన్‌హెచ్ 65లలో హెల్మెట్‌లు లేకుండా అజాగ్రత్తగా ద్విచక్రవాహనాలను నడిపి భారీ వాహనాల కింద చాలా మంది చితికిపోయారు. వీరు హెల్మెట్ పెట్టుకొని ఉంటే గాయాలతో బతికి బయటపడే వారని పోలీసులు గుర్తించారు. దీంతో కొత్త ఏడాదిలో ఈ తరహా మరణాలను మరింతగా తగ్గించేందుకు చలాన్‌లు, జరిమానాలు లేకుండా రహదారులపై హెల్మెట్ పెట్టుకున్న వారినే అనుమతిస్తామని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. వాహనదారులు ధరించే హెల్మెట్ ఐఎస్‌ఐ మార్కు కలిగి, ఫుల్‌గా ఉండాలని స్పష్టం చేశారు. దీనిపై అవగాహన కల్పిస్తామని చెప్పారు.
వాహనదారుల ప్రాణాలు ముఖ్యం:ఎస్‌ఎం విజయ్‌కుమార్, డీసీపీ సైబరాబాద్ ట్రాఫిక్ విభాగం
జరిమానాలు, చలాన్‌లు మాకు ముఖ్యం కాదు.. వాహనదారుల ప్రాణాలు కాపాడటమే లక్ష్యం. హెల్మెట్ లేకుండా వెళ్లే వాహనదారులను ఆపి వారికి రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తాం. వారు హెల్మెట్ తెచ్చుకొనే వరకు వాహనాన్ని ఇవ్వం. డ్రైవర్‌తో పాటు పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ ధరించాల్సిందే.