కొత్త సంవత్సరం…కొత్త మార్పులు…అవేంటో తెలుసా?!

కొత్త సంవత్సరంలో పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. జనవరి ఒకటో తేదీ నుంచి మన నిత్య జీవితానికి సంబంధించిన పలు మార్పులు జరుగబోతున్నాయి. ఇందులో వాహనాలు, బ్యాంకింగ్‌, టెలికాం రంగాలకు చెందిన మార్పులు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఇకపై రూ.5 వేలు

ఇప్పటివరకు కాంటాక్ట్‌లెస్‌ కార్డుల ద్వారా పిన్‌ ఎంటర్‌ చేయకుండా రూ.2 వేలు మాత్రమే పేమెంట్‌ చేసే వీలుండేది. ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.5 వేలకు పెంచారు. ఎన్‌ఎఫ్‌సీ ద్వారా ఈ కార్డులు పనిచేస్తాయని ఆర్బీఐ తెలిపింది. నగదు పరిమితిని తగ్గించడంగానీ, పూర్తిగా జరుగకుండా నిలిపివేయడంగానీ ఖాతాదారుడి ఇష్టం మేరకు జరుగుతుంది.

చెక్కుల్లో ‘పాజిటివ్‌ పే’

చెక్కుల ద్వారా జరిపే చెల్లింపుల్లో మోసాలను అరికట్టేందుకు రిజర్వు బ్యాంక్‌ (ఆర్బీఐ) జనవరి 1 నుంచి ‘పాజిటివ్‌ పే’ అనే నూతన విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నది. దీంతో చెక్కుల ద్వారా మరింత సురక్షితంగా లావాదేవీలు నిర్వహించుకునేందుకు వీలవుతుంది. సాధారణంగా చెక్కు, దానిపై ఉన్న ఖాతాదారుని సంతకం నిజమైనవి అయితేనే బ్యాంకులు ఆ చెక్కును మంజూరు చేస్తాయి. కానీ చెక్కు వివరాలను మార్చి మోసాలకు పాల్పడుతున్న అక్రమార్కుల లీలలు నిత్యం ఏదో ఒక ప్రాంతంలో వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇలాంటి మోసాలను నిలువరించేందుకే ‘పాజిటివ్‌ పే’ విధానాన్ని తీసుకొస్తున్నారు. రూ.5 లక్షలు, ఆపై మొత్తాలకు జారీచేసిన చెక్కులను బ్యాంకులు పునఃసమీక్షించనున్నారు.

కార్లు, బైక్‌లు ఇక ప్రియం..

కొత్త ఏడాదిలో బైక్‌, కారు కొనాలనుకునేవారికి ఊహించని షాక్‌ రానున్నది. ముడిసరుకుల ధరలు పెరుగడంతో ఉత్పత్తి వ్యయం పెరిగినందున.. జనవరి ఒకటి నుంచి అన్ని రకాల వాహనాల ధరలు పెంచుతున్నట్లు వాహన తయారీ సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్‌ మహీంద్రా, రెనో. ఎంజీ మోటార్‌ ఇండియాతోపాటు దేశీయ బైకుల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌ కూడా ధరల పెంపు నిర్ణయాన్ని ప్రకటించాయి. అదేవిధంగా జనవరి ఒకటో తేదీ నుంచి ఫ్రిజ్‌లు, వాషింగ్‌మెషిన్లు, టీవీలు, ఏసీల ధరలు కూడా పెరుగనున్నాయి.

‘సున్నా’ జత చేయాల్సిందే!

ల్యాండ్‌లైన్‌ నుంచి మొబైల్‌ ఫోన్లకు చేసే కాల్స్‌కు సంబంధించి కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ కొత్త నిర్ణయాన్ని ప్రకటించింది. ఇకపై ల్యాండ్లైన్‌ నుంచి మొబైల్‌కు ఫోన్‌ చేయాలంటే ‘సున్నా’ను తప్పనిసరిగా జతచేయాలని తెలిపింది. భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా తగినన్ని సంఖ్యా వనరుల సృష్టికి ట్రాయ్‌ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల 2,539 సంఖ్య శ్రేణులు అందుబాటులోకి వస్తాయి. ఈ విధానం జనవరి 15 నుంచి అమలులోకి రానున్నది. అయితే, మొబైల్ నుంచి మొబైల్‌కు, ల్యాండ్‌లైన్‌ నుంచి ల్యాండ్‌లైన్‌కు, మొబైల్‌ నుంచి ల్యాండ్‌లైన్‌కు చేసే కాల్స్‌లో ఎలాంటి మార్పులు ఉండవు.

మూణ్ణెళ్లకోసారి రిటర్నులు

చిన్నా వ్యాపారులకు ఊరటనిచ్చేవిధంగా జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం మేరకు రూ.5 కో్ట్ల లోపు వార్షిక టర్నోవర్‌ కలిగిన వ్యాపారులు ఇకపై నెలనెలా రిటర్నులు దాఖలు చేయాల్సిన బాధ తప్పింది. జనవరి ఒకటో తేదీ నుంచి మూడు నెలలకు ఒకసారి రిటర్నులు దాఖలు చేస్తే సరిపోతుందని నిర్ణయం తీసుకున్నారు. దీని వల్ల దేశంలోని దాదాపు 94 లక్షల మంది లబ్ధి చేకూరనున్నది.

కొన్ని ఫోన్లలో వాట్సాప్‌ రాదు..

జనవరి ఒకటో తేదీ నుంచి కొన్ని రకాల మొబైల్‌ ఫోన్లలో వాట్సాప్‌ పనిచేయదు. ఐఫోన్లు ఐవోఎస్‌ 9, ఆండ్రాయిడ్‌ ఫోన్లలో 4.0.3 ఆపరేటింగ్‌ సిస్టం కన్నా ముందున్న ఫోన్లలో వాట్సాప్‌ సేవలు నిలిచిపోనున్నాయి. ఐవోఎస్‌ 9 కన్నా (ఐఫోన్‌ 4) ముందు వచ్చిన మోడళ్లలో కూడా వాట్సాప్‌ సేవలు ఉండవు. ఒకవేళ మీరు వాడుతున్నది మరీ పాత ఫోన్‌ అయినపక్షంలో సెట్టింగ్స్‌లోకి వెళ్లి వెర్షన్‌ను తనిఖీ చేసుకోవడం ఉత్తమం.

‘ఫాస్టాగ్‌’ ఉపశమనం

జనవరి ఒకటి నుంచి అమలుకావాల్సిన ఫాస్టాగ్‌ తప్పనిసరి నిర్ణయంపై కేంద్ర కొంత వెసులుబాటు కల్పించింది. వాహనాలకు ఫాస్టాగ్‌ తీసుకునేందుకు వీలుగా గడువును ఫిబ్రవరి 15 వరకు పొడిగించింది. జాతీయ రహదారులపై టోల్‌ గేట్ల వద్ద రద్దీని నివారించేందుకు ఫాస్టాగ్‌ తప్పనిసరి అని కేంద్రం ప్రకటించింది. జనవరి ఒకటిగా ఉన్న డెడ్‌లైన్‌ను పొడిగించడంతో వాహనదారులకు కొంత ఉపశమనం లభించినట్లయింది. నాలుగేండ్ల క్రితం తీసుకొచ్చిన ఈ విధానంతో టోల్ గేట్ల వద్ద వాహ‌నాలు టోల్ చెల్లించ‌డానికి ఆగాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. 2017 డిసెంబ‌ర్ 1 నుంచి కొత్త కార్ల రిజిస్ట్రేష‌న్‌కు ఫాస్టాగ్‌ను తప్పనిస‌రి చేశారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.