నేపాలీ బుడ్డోడు ఖమ్మంలో జన్మించాడు

నేపాలీ జాతీయురాలు ఖమ్మంలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇందులో విచిత్రం ఏముందని ఖమ్మంలో నివసించే నేపాలీ మహిళ ఆస్పత్రిలో ప్రసవించి ఉంటుందని అనుకుంటే పొరపాటే. ఈ ప్రసవం వెనుక ఎంతో ప్రయాస దాగి ఉంది. కొన్ని శాఖలు సత్వరం స్పందించి, సమన్వయంతో పని చేసిన తీరు ఉంది. ఫలితంగా ఓ విదేశీ మహిళకు ఎలాంటి అపాయం జరగకుండా క్షేమంగా ప్రసవం జరిగింది. విదేశీయుల విషయంలో ఇక్కడి అధికారుల అప్రమత్తత, వారు సాయం చేసే తీరు కచ్చితంగా కొనియాడదగినదేనని ఈ ఘటనతో నిరూపితమైంది. నేపాల్‌‌ రాజధాని ఖాఠ్మాండూకు సమీపంలో డైలీక్‌ అనే ప్రాంతానికి చెందిన మాడా హనితాదేవి బెంగళూరు-యశ్వంత్‌పూర్‌ వెళ్లే సూపర్ ఫాస్ట్ రైలు ఎక్కారు. డాక్టర్లు ఆమెకు సూచించిన కాన్పు తేదీకి మరికొన్ని రోజులు సమయం ఉంది. కానీ, రైలులో ఉండగానే హనితాకు పురిటినొప్పులు మొదలయ్యాయి. రైలు అప్పుడు ఖమ్మంకు దగ్గర్లో ఉంది.ఆమెతో పాటు ఉన్న వారిలో ఎవరికీ తెలుగు రాదు. అయినా ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్న తోటి ప్రయాణికులు రైల్వే సిబ్బందికి సమాచారం ఇచ్చారు. స్పందించిన రైల్వే కానిస్టేబుల్‌ ఖమ్మంలోని రైల్వే సీఐ మధుసూదన్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన కూడా వెంటనే స్పందించి ఖమ్మం ప్రభుత్వాసుపత్రి వైద్యులను అప్రమత్తం చేశారు. ప్రసూతి వార్డు సిబ్బంది కూడా సిద్ధంగా ఉండేలా చూశారు. వెంటనే 108 అంబులెన్స్‌ను రైల్వే స్టేషన్‌కు వచ్చేలా సిద్ధం చేశారు. అప్పటికే స్టేషన్‌ సూపరింటెండెంట్‌ను కూడా అప్రమత్తం చేసి బెంగళూరు-యశ్వంత్‌పూర్ రైలును ఆపడానికి ప్రత్యేక అనుమతి తీసుకున్నారు. నిజానికి ఈ సూపర్‌ఫాస్ట్ రైలుకు ఖమ్మం స్టేషన్‌లో ఆపేందుకు అనుమతి లేదు.తీవ్రమైన పురిటి నొప్పులతో అల్లాడిపోతున్న మహిళను హుటాహుటిన 108 అంబులెన్స్‌లోకి ఎక్కించి ఆమెను నేరుగా ప్రభుత్వాసుపత్రిలోని ప్రసూతి వార్డుకు తరలించారు. అలా ఆసుపత్రిలోకి తీసుకెళ్లిన కొద్ది నిమిషాలకే హనితాదేవి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అర్ధరాత్రి దాటినా అప్పటికే సిద్ధంగా ఉన్న కాన్పుల విభాగం వైద్యాధికారి డాక్టర్‌ కృపా ఉషశ్రీ, డాక్టర్‌ హస్మి ఆమెకు మెరుగైన వైద్యం అందించారు.ఆమెతో పాటు ఉన్న మరో ఐదుగురికి కూడా భోజనం, వసతి ఏర్పాట్లు చేశారు. రాత్రి వేళ రైలులో సిబ్బంది వెంటనే స్పందించి వేగంగా నిర్ణయాలు తీసుకున్న రైల్వే పోలీసు అధికారులను, వైద్యాధికారులకు హనితాదేవి ధన్యవాదాలు తెలిపారు.