నాంప‌ల్లి నుమాయిష్ తాత్కాలిక వాయిదా

హైదరాబాద్ : కొత్త సంవ‌త్స‌రంతో పాటు హైద‌రాబాద్‌కు ప్ర‌తి ఏడాది మ‌రో పండుగ వ‌చ్చేది. అదే నాంప‌ల్లి నుమాయిష్. కానీ ప్ర‌తి ఏడాది జ‌న‌వ‌రి ఒక‌టో తేదీన ప్రారంభ‌మ‌య్యే నుమాయిష్‌ను తాత్కాలికంగా వాయిదా వేశారు. రేప‌ట్నుంచి ప్రారంభం కావాల్సిన  నుమాయిష్‌ను తాత్కాలికంగా వాయిదా వేస్తున్న‌ట్లు నాంప‌ల్లి ఎగ్జిబిష‌న్ సొసైటీ అధ్య‌క్షుడు, రాష్ర్ట మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ స్ప‌ష్టం చేశారు. క‌రోనా వ్యాప్తి కార‌ణంగానే నుమాయిష్‌ను కొద్ది రోజుల పాటు వాయిదా వేస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. నుమాయిష్ ఎప్ప‌ట్నుంచి ప్రారంభిస్తామ‌నేది త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తామ‌ని పేర్కొన్నారు.  ప్ర‌తి ఏడాది జ‌న‌వ‌రి ఒక‌టో తేదీన ప్రారంభ‌మ‌య్యే నుమాయిష్.. ఫిబ్ర‌వ‌రి 15వ తేదీ వ‌ర‌కు కొన‌సాగుతుండేది. వివిధ రాష్ర్టాల నుంచి సుమారు 1500 నుంచి 2 వేల వ‌ర‌కు స్టాళ్ల‌ను ఏర్పాటు చేసేవారు. పిల్ల‌లు ఆడుకునే ఆట‌బొమ్మ‌లు, కిచెన్ సామాను నుంచి మొద‌లుకొంటే.. ధ‌రించే బ‌ట్ట‌ల వ‌ర‌కు ఈ స్టాళ్ల‌ల్లో ల‌భిస్తాయి. ఒక ఇంటికి కావాల్సిన ప్ర‌తి వ‌స్తువు ఈ ఎగ్జిబిష‌న్‌లో దొరుకుతుంది. తినుబండారాల కోస‌మ ఎగ్జిబిష‌న్‌కు వెళ్తార‌న‌డంలో కూడా సందేహం లేదు.