మంచిర్యాల : రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ప్రభుత్వం నుంచి మరింత ప్రోత్సాహం అందిస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆయిల్ పామ్ రైతులకు గత ప్రభుత్వాలు ప్రోత్సాహం అందించకపోవడంతో ఇబ్బంది పడ్డారని పేర్కొన్నారు. రైతులు సంప్రదాయ పంటల సాగు నుంచి బయటకు రావాలని సూచించారు. చెన్నూర్ మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన రైతు, వైస్‌ఎంపీపీ బాపురెడ్డి ఆయిల్ పామ్ క్షేత్రాన్ని ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌లతో కలిసి మంత్రి సందర్శించి మాట్లాడారు.
తెలంగాణలో సాగునీటి వసతి పెరగడంతో భూములు ఆయిల్ పామ్ సాగుకు అనుకూలంగా మారాయని కేంద్ర ప్రభుత్వ సంస్థలే వెల్లడించాయని గుర్తుచేశారు. ఆయిల్ పామ్ సాగు రైతు అవసరం కాదని దేశ అవసరమన్నారు. దేశంలో ఏడాదికి 21 మిలియన్ టన్నుల నూనె అవసరం ఉండగా ఏడు మిలియన్ టన్నులే అందుబాటులో ఉంటుందని తెలిపారు. పంట దిగుబడికి కొనుగోలుకు భద్రత ఉన్న ఏకైక పంట ఆయిల్ పామ్ అని చెప్పారు. ఒకసారి సాగుచేస్తే నాలుగేళ్లకు దిగుబడి మొదలై 30 ఏళ్ల వరకు వస్తుందని తెలిపారు. చెన్నూరు నేలలు ఆయిల్ పామ్ సాగుకు అత్యంత అనుకూలమైనవి చెప్పారు. సంప్రదాయ పంటల నుంచి రైతుల దృష్టి మళ్లించి నమ్మకం కలిగించేందుకు పార్టీ నాయకులే ముందుగా ఆయిల్ పామ్ పంట సాగుచేయాలి సూచించారు.