హైదరాబాద్,తీస్మార్ న్యూస్:తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదే అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం పరిధిలోని జైభవాని నగర్‌లోని రైతుబజార్ వద్ద నిర్మించిన 324 డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రి కేటీఆర్ బుధవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు.
పేదోడు ఆత్మగౌరవంతో బతకాలన్నదే సీఎం కేసీఆర్ ఉద్దేశమని స్పష్టం చేశారు. అందుకనుగుణంగా పేదోడి ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉండే విధంగా ఈ ఇండ్లను నిర్మించి ఇస్తున్నాం. ఇలాంటి ఇండ్లు భారతదేశంలోని ఏ రాష్ర్టంలో ఏ ప్రభుత్వం కూడా నిర్మించలేదు. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా వంటి నగరాల్లో ఇలాంటి ఇండ్లు నిర్మించలేదు. రెండు పడకగదులు, ఒక హాల్, కిచెన్‌తో పాటు రెండు బాత్రూమ్‌లను నిర్మించాం. ఒక్కో ఇంటికి రూ. 9 లక్షల ఖర్చు పెట్టి నిర్మించామని తెలిపారు. దాదాపు రూ. 50 లక్షల విలువ చేసే ఫ్లాట్‌ను పేదలకు సీఎం కేసీఆర్ ఇస్తున్నారని తెలిపారు. ఒక్క పైసా కూడా తీసుకోకుండా ఇండ్లు నిర్మిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌ది అని స్పష్టం చేశారు. కమర్షియల్ అపార్ట్‌మెంట్ల తరహాలో డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించాం. ఇల్లు బాగుంటే సరిపోదు.. పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చెత్తను తీసుకువచ్చి ఇండ్ల మధ్యలో పారేయొద్దు. కొత్త రోగాలు, జబ్బులు రాకుండా ఉండాలన్న, పిల్లల ఆరోగ్యం మంచిగా ఉండాలన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇందుకోసం కమిటీలను ఏర్పాటు చేసుకుని ఈ గృహ సముదాయాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కేటీఆర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ మల్లేశం, మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. రెండు ఎకరాల విస్తీర్ణంలో 3 బ్లాక్‌లుగా 9 అంతస్తుల్లో 324 డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించారు. ఈ ఇండ్లను రూ.28కోట్ల వ్యయంతో నిర్మించారు. ఇండ్ల ప్రారంభంతో లబ్దిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ఎన్నో ఏండ్ల కల సాకారమైందని, సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామని లబ్దిదారులు స్పష్టం చేశారు.