జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి అంటారు. ఆలోచనలు, ఆశయాలు, అభిప్రాయాలు ఏ ఒక్క వ్యక్తి సొంతం కాదు. తమ ఆశయాలకు తగ్గట్టు ఆదర్శంగా జీవించాలని తపన పడుతుంటారు. అలా తపన పడుతున్న వారిలో తమిళనాడులోని చిన్నదొరై ఒకడు. కాలుష్యం నుంచి కడలి (సముద్రం)ని కాపాడుకునేందుకు, దానిపై అవగాహన కల్పించే ఆశయంతో వినూత్నంగా ఆలోచించాడు. అందులో భాగమే కడలిలో కల్యాణం చేసుకుని లోకం దృష్టిని ఆకర్షించాడు.తిరువన్నామలైకి చెందిన చిన్నదురైకి ప్రకృతిపై విపరీతమైన మమకారం. కాలుష్యంబారిన పడి కడలి నాశనమవుతోందని ఆవేదన అతనిలో బలంగా ఉంది. కాలుష్యం నుంచి కడలిని కాపాడుకోవాలనే చైతన్యాన్ని తేవాలనుకున్నాడు. ఈ నేపథ్యంలో అతనికి కోయంబత్తూరు జిల్లాకు చెందిన శ్వేతకు పెద్దలు పెళ్లి నిశ్చయించారు. వీరిద్దరూ చెన్నైలోని ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే.అందరిలా భాజాభజంత్రీల మధ్య మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కావాలనుకోలేదు. తమ పెళ్లికి ఓ ప్రత్యేకత, సార్థకత ఉండాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. దీంతో సముద్రపు జలాల అడుగులో పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. పెళ్లికొడుకు చిన్నదురై పుదుచ్చేరిలో తన స్నేహితుడు నడుపుతున్న స్కూబా డైవింగ్ శిక్షణ కళాశాలలో ట్రైనింగ్ తీసుకున్నాడు. సోమవారం ఉదయం పెళ్లికుమార్తె శ్వేతతో కలిసి చెన్నై సమీపం నీలాంగరై సముద్రంలో ఒక పడవలో అలలపై ప్రయాణిస్తూ 60 అడుగుల దూరానికి చేరుకున్నాడు.వధూవరులిద్దరూ అక్కడ పెళ్లి దుస్తులు వేసుకున్నారు. ఆక్సిజన్ సిలిండర్ అమర్చిన స్కూబా డైవింగ్ డ్రస్సును ఇద్దరు వేసుకుని సముద్రంలోకి దూకారు. సముద్రపు అడుగు భాగంలో మొక్కల మధ్య పూలతో అలంకరించిన వివాహవేదిక వద్ద అలల్లో తేలియాడుతూ పరస్పరం పూల దండలు మార్చుకున్నారు. అక్కడే పెళ్లికుమార్తె శ్వేత మెడలో తాళి బొట్టుకట్టాడు. మాంగల్యధారణ పూర్తికాగానే వధూవరులిద్దరూ సముద్రతీరానికి చేరుకున్నారు.ఈ సందర్భంగా చిన్నదొరై మీడియాతో మాట్లాడుతూ.. సముద్రంలోకి వెళ్లినప్పుడు కాలుష్యాన్ని చూసి బాధ కలిగిందన్నాడు. దీంతో కడలిని కాపాడుకునేందుకు ప్రజలకు ఓ సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే వినూత్నంగా పెళ్లి చేసుకున్నట్టు చెప్పుకొచ్చాడు. ఈ నెల 13న చెన్నై శోళింగనల్లూరులో రిసెప్షన్ ఏర్పాటు చేశానని, పెళ్లిని నేరుగా చూడలేని వారికి ఆ లోటును తీరుస్తానని చెప్పాడు.
