హైదరాబాద్,తీస్మార్ న్యూస్: తెలంగాణను చలిపులి వణికిస్తోంది. నిత్యం రాత్రిపూట ఉష్ణోగ్రత గణనీయంగా పడిపోతున్నాయి. ఇప్పటికే చలితో ప్రజలు వణికిపోతుంటే రాబోయే రెండు రోజుల్లో మరింత చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హిమాలయాల నుంచి రాష్ట్రం వైపు శీతల గాలులు వీస్తున్నాయని తెలిపింది. రాష్ట్రంలో రెండు రోజుల పాటు పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణం కేంద్రం పేర్కొంది. చలిగాలుల ప్రభావంతో రాత్రిపూట ఉష్ణోగ్రతలు మరింత తగ్గి చలి తీవ్రత పెరుగుతుందని అధికారులు తెలిపారు. మంగళ, బుధవారాల్లో పలు చోట్ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఆదిలాబాద్, కొమురం భీం జిల్లాల్లో ఉష్టోగ్రతలు భారీగా పడిపోయాయి. ఆదిలాబాద్ జిల్లా అర్లిలో 3.6 డిగ్రీలు, సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 3.8, కొముర్రం భీం జిల్లా గిన్నెదరిలో 4.3, ఆదిలాబాద్ జిల్లా బేలాలో 5.0 సంగారెడ్డి జిల్లా సత్వార్‌లో 5.1, అల్గోల్‌లో 5.3, కొముర్రం భీం జిల్లా వాంకిడిలో 5.1 డిగ్రీ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
