ఆరేండ్ల కాలంలో హైదరాబాద్‌లో శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్నాయని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నగరంలోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీట్ ది ప్రెస్‌లో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించే వారు గుండె మీద చేయి వేసుకుని ఆలోచించాలి. నగరంలో పేకాట క్లబుల్లు,గుడుంబా గబ్బు ,బాంబు పేలుళ్లు, మత కల్లోలాలు, అల్లర్లు,కర్ఫ్యూ,ఆకతాయిల ఆగడాలు, పోకిరీల పోకడలు లేవు. ఇవి వాస్తవం ఇవన్నీ మీరు ఆలోచించాలి అని ప్రతిపక్షాలకు కేటీఆర్ సూచించారు.
సీసీ కెమెరాల ఏర్పాటులో దేశంలో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉంది. ప్రపంచంలో హైదరాబాద్ 16వ స్థానంలో ఉందన్నారు. దేశంలో 65 శాతం సీసీ కెమెరాలు హైదరాబాద్‌లో ఉన్నాయి. హైదరాబాద్‌లో 5 లక్షల సీసీ కెమెరాలు ఉన్నాయి. వీటి సంఖ్యను 10 లక్షలకు పెంచుతామనితెలిపారు. ఈ సీసీ కెమెరాలన్నింటీని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేస్తామన్నారు.
ప్రశాంతంగా హైదరాబాద్
తెలంగాణ ఏర్పడి 6 సంవత్సరాల అయిపోయింది. ఆరున్నరేండ్ల కింద ఒక రకమైన అనిశ్చితి వాతావరణం ఉండే. నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని, మత విద్వేషాలు చెలరేగుతాయని అన్నారు. అంధకారం అయిపోతోంది అని నిందారోపణలు చేశారు. కొత్త పెట్టుబడిదారులు కాదు.. ఉన్నవారే పారిపోతారు అని అన్నారు. మా నాయకత్వం మీద, ప్రత్యేకంగా టీఆర్ఎస్ పార్టీ మీద నిందలు వేశారు.
ఆరున్నరేండ్ల తర్వాత పరిస్థితి అంతా ప్రశాంతంగా ఉంది. అన్ని కోణాల్లో ప్రగతి పథంలో ఉన్నాం.. భారతదేశం మనవైపు చూస్తుందనడానికి కారణం కేసీఆర్ మాత్రమే. ఎక్కడా కూడా గిల్లి కజ్జాలు, పంచాయితీలకు తావు ఇవ్వలేదు. పక్కా ప్రణాళికతో నగరాభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. నగర ప్రజల ప్రాధాన్యాలు, ప్రాథమిక అవసరాలు గుర్తించి పని చేశామన్నారు.