ప‌ట్ట‌ణ పేద‌ల‌కు మెరుగైన వైద్య సేవ‌లు : మ‌ంత్రి కేటీఆర్

హైద‌రాబాద్ : పట్ట‌ణ‌ పేద‌ల‌కు మెరుగైన వైద్య సేవ‌లు అందించాల‌నే ఉద్దేశంతో డ‌యాగ్నోస్టిక్ సెంట‌ర్ల‌ను ప్రారంభిస్తున్నామ‌ని రాష్ర్ట ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని శ్రీరామ్‌న‌గ‌ర్‌లో మంత్రి కేటీఆర్ డ‌యాగ్నోస్టిక్ మినీ హ‌బ్ సెంట‌ర్‌ను ప్రారంభించారు.ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రెండేండ్ల కింద నారాయ‌ణ‌గూడలో ఐపీఎం ప్రారంభించుకున్నాము. ఆ త‌ర్వాత ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ సేవ‌ల‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నామ‌ని తెలిపారు. ర‌క్త ప‌రీక్ష‌లు, మూత్ర ప‌రీక్ష‌లు ఇప్ప‌టికే అందుబాటులోకి వ‌చ్చాయ‌ని, ఇప్పుడు కొత్త‌గా ఎంఆర్ఐ, ఆల్ర్టా సౌండ్, సిటీ స్కాన్ వంటి ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు ఈ సెంట‌ర్ల‌ను నెల‌కొల్పామ‌ని చెప్పారు. డ‌యాగ్నోస్టిక్ సెంట‌ర్ల‌లో మొత్తం 57 ర‌కాల ర‌క్త ప‌రీక్ష‌ల‌ను చేస్తున్న‌ట్లు తెలిపారు. ప‌ట్ట‌ణ పేద‌ల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. క‌రోనా కాలంలో వైద్యులు, ఇత‌ర సిబ్బంది అందించిన సేవ‌ల‌ను ప్ర‌భుత్వం ఎప్ప‌టికీ మ‌రిచిపోదు అని పేర్కొన్నారు. డ‌యాగ్నోస్టిక్ సెంట‌ర్ల‌ను భ‌విష్య‌త్‌లో జిల్లా కేంద్రాల‌కు విస్త‌రించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని మంత్రి కేటీఆర్ తెలిపారు.