హైదరాబాద్ : రాష్ర్టంలో పని చేసే ప్రభుత్వాన్ని ఆదరించాలని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఉదయం సనత్‌నగర్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులతోపాటు నిర్మాణం పూర్తి చేసుకున్న భవనాలను ప్రారంభించారు. ఉదయం 10 గం.లకు సనత్‌నగర్‌లోని బల్కంపేట్‌లో రూ. 3.60కోట్లతో నిర్మించిన వైకుంఠధామాన్ని కేటీఆర్ ప్రారంభించారు. ఫతేనగర్ ఫ్లై ఓవర్ సమీపంలో 2.45 ఎకరాల విస్తీర్ణంలో వైకుంఠధామం నిర్మించారు. శ్మశానవాటిక ప్రవేశమార్గాన్ని జీహెచ్ఎంసీ ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ర్టంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం సనత్ నగర్ నియోజకవర్గం నుంచే చేపట్టాం. ఆదర్శవంతంగా ఇండ్లను నిర్మించాం. సనత్‌నగర్‌లో వైకుంఠధామం, స్పోర్ట్స్ కాంప్లెక్స్, లింక్ రోడ్లను నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించాలని సీఎం కేసీఆర్ చెప్పారు. ఆ విధంగా సనత్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకుంటున్నామని తెలిపారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలకు ఉపయోగపడే విధంగా పనులు చేస్తున్నాం. కరెంట్ సమస్య లేదు. తాగునీటి కష్టాలు లేవు. రోడ్లను అభివృద్ధి చేసుకుంటున్నాం. హైదరాబాద్‌లో సనత్ నగర్ నియోజకవర్గం అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
