దుబ్బాక,జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంతర్మథనంలో ఉన్నట్టు సమాచారం.ఈ నేపథ్యంలో ఎలాగైనా బీజేపీ ఎత్తులను చిత్తు చేయాలని.. ప్రజలు మనసులు గెలుచుకోవాలని కేసీఆర్ చూస్తున్నారట. రాష్ట్రంలో అనూహ్యంగా బీజేపీ పుంజుకోవడంతో కేసీఆర్ కొంత టెన్షన్ పడుతున్నారట. ఇందుకోసం పక్కా వ్యూహాలకు పదునుపెడుతున్నారట. వ్యూహాలు రచించడం.. ప్రత్యర్థులను ఇరుకునపెట్టడంలో కేసీఆర్ దిట్ట. అందుకే ఇంతకాలం పాటు రాష్ట్రంలో టీఆర్ఎస్కు ఎదురులేకుండా పోయింది. అయితే ఇటీవల బీజేపీ పుంజుకోవడం టీఆర్ఎస్ శ్రేణులను నిరాశకు గురిచేసింది. దుబ్బాకలో ఓడిపోయినప్పటికీ.. గ్రేటర్ హైదరాబాద్‌లో ఘనవిజయం సాధిస్తామని టీఆర్ఎస్ భావించింది. కానీ అక్కడ కూడా దెబ్బ పడింది. ప్రజలు మాత్రం వినూత్న తీర్పు ఇచ్చారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన చాలా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ వెనకబడిపోయింది. మంత్రులను ఇంచార్జిలుగా నియమించినప్పటికీ టీఆర్ఎస్కు ఆశించిన ఫలితాలు రాలేదు. అయితే ఇప్పుడు కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని భావిస్తున్నడట. అంతేకాక మంత్రివర్గ విస్తరణ కూడా చేపట్టబోతున్నట్టు సమాచారం. ఇప్పుడున్న చాలామంది మంత్రులకు ఉద్వాసన పలికి కొత్తవారిని తీసుకోబోతున్నట్టు సమాచారం. పార్టీ ప్రక్షాళన చేయబోతున్నట్టు సమాచారం. కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టబోతున్నారట.
ముఖ్యమంత్రిగా ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు సమాచారం. ఇటీవల మహబూబాబాద్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ మాట్లాడుతూ.. త్వరలోనే సీఎంగా కేటీఆర్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని అన్నారు. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో చాలామందికి ఉద్వాసన తప్పదట. అంతేకాక ప్రస్తుతం మంత్రులగా ఉన్న ఈటల రాజేందర్, హరీశ్‌రావుకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. వాళ్లను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించబోతున్నారట.
మరోవైపు కవితను క్యాబినెట్లోకి తీసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సీఎం కేసీఆర్ ఆరోగ్యం పూర్తిస్థాయిలో సహకరించడం లేదని సమాచారం. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లడం సాధ్యం కాకపోవచ్చు. అందుకే కేటీఆర్‌కు ఆ బాధ్యతలు అప్పజెప్పనున్నట్టు టాక్. మరోవైపు ఈటల రాజేందర్, హరీశ్‌రావు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అన్ని జిల్లాల్లో పార్టీలకు నూతన కమిటీలు వేసి.. పార్టీని మరింత బలోపేతం చేయనున్నట్టు సమాచారం.
