అంగట్లో అమ్మకానికి భారత్…

 కేంద్ర ప్రభుత్వ ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలపై త్వరలోనే దేశవ్యాప్త నిరసనకు టీఆర్‌ఎస్‌ సిద్ధమైందని, డిసెంబర్‌ రెండోవారంలో జాతీయస్థాయిలోని ప్రతిపక్ష పార్టీలన్నింటితో కలిసి హైదరాబాద్‌ కేంద్రంగా ఒక కాన్‌క్లేవ్‌ (సదస్సు) నిర్వహించబోతున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపట్టనున్నట్టు వెల్లడించారు. బుధవారం తెలంగాణభవన్‌లో పార్టీ శాసనసభాపక్షం, పార్లమెంటరీపార్టీ, అన్ని కార్పొరేషన్ల చైర్మన్లు ఇతర నాయకులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ బాధ్యతలు స్వీకరించి ఆరున్నరేండ్లు గడిచినా దేశంలో జరిగిన అభివృద్ధి ఏమీలేదని, పైగా దేశం ఇప్పుడు తిరోగమనంలో నడుస్తున్నదని తెలిపారు.

మోదీ ప్రధాని అయ్యాక 23 ప్రభుత్వరంగ సంస్థలను అమ్మకానికి పెట్టారని, అద్భుత లాభాలను తెచ్చిపెట్టిన వీటిని విదేశీ కంపెనీలకు తెగనమ్ముతున్నారని విమర్శించారు. మోదీ ప్రధాని కావడంవల్ల దేశ ప్రజలకు ఒరిగిందేమీలేదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక వైఖరిని ఇక ఉపేక్షించేది లేదని, అవసరమైతే కార్మికుల పక్షాన, దేశ ప్రజలు, రైతాంగంపక్షాన యుద్ధంచేస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ, నిష్క్రియాపరత్వ విధానాలపై జాతీయస్థాయిలోని వివిధ పార్టీలతో మాట్లాడుతున్నామని, బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, కేరళ సీఎం పినరయి విజయన్‌, డీఎంకే నేత స్టాలిన్‌, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌యాదవ్‌, ఒడిశా అధికారపార్టీ బీజూ జనతాదళ్‌నేత పినాకిని శర్మ, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌, అకాళీదళ్‌నేత సుఖ్బీర్‌సింగ్‌ బాదల్‌, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో ఇప్పటికే మాట్లాడామన్నారు. సమావేశంలో సీఎం కేసీఆర్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే..

తప్పుడు ప్రచారాలు.. విధానాలతోనే తిరోగమనం

‘తప్పుడు ప్రచారాలతో, తప్పుడు విధానాలతో దేశాన్ని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తిరోగమనంవైపు నెట్టింది. కాంగ్రెస్‌ నిష్క్రియాపరత్వ రాజకీయాల నేపథ్యంలో నరేంద్రమోదీ ప్రభుత్వం, బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేకవిధానాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత ఇతర పక్షాలపై పడింది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించుకోవడం ద్వారా ఆ సంస్థలను కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ కంపెనీల చేతుల్లో పెడుతున్నది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులకు సంఘీభావంగా ఉండి, పెట్టుబడుల ఉపసంహరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా యుద్ధం చేస్తాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటిదాకా ప్రజలకోసం, రైతులకోసం, దళితులకోసం, గిరిజనులకోసం, బలహీనవర్గాల కోసం, కార్మికుల కోసం ఒక్కటంటే ఒక్కపని కూడా చేయలేదు. చెప్పుకోవడానికి వారికి ఒక్క విషయం కూడా లేదు. ఎన్నికలప్పుడు రాజకీయ లబ్ధి పొందడానికి పాకిస్తాన్‌, కశ్మీర్‌, పుల్వామా అంటూ ప్రచారానికి దిగుతారు. ప్రజల భావోద్వేగాలను రెచ్చగొడతారు. ప్రజలను మతపరంగా విభజించే ప్రయత్నం చేస్తారు. మత కల్లోలాలను రేపి ఎన్నికల్లో లబ్ధి పొందుతారు. అంతేతప్ప దేశం కోసం, ప్రజల కోసం వారు ఏ ఒక్క పని చేయలేదు. సరిహద్దుల్లో ఏదో యుద్ధంచేసినట్లు ప్రచారం చేసుకొంటారు. అదే చైనాకు వ్యతిరేకంగా కొట్లాడలేక చతికిలపడతారు. ఏదో చేసినట్లు తప్పుడు ప్రచారం జోరుగా చేసుకొంటారు. బేటీ బచావో, బేటీ పఢావో లాంటి అందమైన నినాదాలతో ఊదరగొడతారు తప్ప వాస్తవానికి ఏ పనీచేయరు. వాళ్ల ప్రచారం గులకరాళ్లడబ్బాను ఊపినట్టు ఉంటుంది.

పిట్ట కథలు.. కట్టుకథలు వద్దు

దేశంలో స్థాపిత విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం  నాలుగు లక్షల మెగావాట్లు ఉండగా దీంట్లో జాతీయస్థాయిలో ఉపయోగించుకొంటున్న కరెంటు కేవలం 2.20 లక్షల మెగావాట్లు మాత్రమే. ఇప్పటికీ మన ప్రభుత్వం.. ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను కూడా అందరికీ ఇవ్వలేకపోతున్నది. దేశ జీడీపీ 31% క్రాష్‌ అయ్యింది. దీనికి ఎవరు బాధ్యులు? మోదీ కాదా?  దేశంలో 70 వేల టీఎంసీల నీళ్లు వృథాగా సముద్రంపాలవుతున్నాయి. వీటిని వాడుకోలేకపోతున్నామని కేంద్ర జలసంఘమే చెప్తున్నది. కేంద్రం వీటిని సద్వినియోగం చేసుకోవడానికి ఏం చేస్తున్నది? నిరుద్యోగం ఎందుకు పెరుగుతున్నది? ఉపాధి, ఉద్యోగ కల్పనలో కేంద్రానిది వైఫల్యం కాదా? దేశాన్ని ఏడేండ్లుగా పాలిస్తున్న బీజేపీ వైఫల్యం కాదా?  ఇంకెన్నాళ్లు దేశ ప్రజలకు పిట్టకథలు.. కట్టుకథలు చెప్తారు..? దేశ సంపదను పెంచేందుకు బీజేపీ చేసిన పనులేమైనా ఉంటే చెప్పమనండి..? తెలంగాణ ఏర్పడే నాటికి మన రాష్ట్ర ప్రజల సగటు తలసరి ఆదాయం 1.12 లక్షలుండేది. ఇప్పుడు అది 2.28 లక్షలకు పెరిగింది. ఇదే పరిస్థితి కొనసాగితే.. ఇక జీడీపీ విషయంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సిగ్గుపడాలి. మన జీడీపీ దారుణంగా పడిపోతున్నది. మన జీడీపీ బంగ్లాదేశ్‌ జీడీపీ కన్న తక్కువ. శ్రీలంక కూడా మనకన్న మెరుగైన పరిస్థితిలో ఉన్నది. ఇదేవిధంగా మోదీపాలన సాగితే త్వరలోనే నేపాల్‌ కూడా మనను అధిగమించడం ఖాయంగా కనిపిస్తున్నది.

కేసీఆర్‌ ఫైటర్‌.. కొట్లాడేవాడు

ఏదైనా అంశంపై కేసీఆర్‌ రంగంలోకి దిగితే కొట్లాడుడే ఉంటది. బలమైన పోరాటాలు అనేకం చేశాం. రాష్ట్రం వచ్చాక  చాలా అణిగిమణిగి ఉన్నాం. ప్రతి అంశంలో ఆచితూచి వ్యహరించాం. మన రాష్ట్రాన్ని అన్నింట్లో అగ్రగామిగా నిలబెట్టాలన్న పట్టుదలతో పనిచేశాం. చరిత్ర సృష్టించిన మిషన్‌ భగీరథను అమలుచేశాం. వెయ్యి గురుకుల స్కూళ్లు పెట్టాం. నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తిచేయగలిగాం. విడిపోతే చెడిపోతామన్నవాళ్ల చెంపఛెళ్లుమనిపించేలా పనిచేశాం. వరిధాన్యం ఉత్పత్తిలో దేశానికి తెలంగాణ అన్నంపెట్టే స్థాయికి చేరింది. 1.32 కోట్ల ఎకరాలకు సాగు పెరిగింది. కేసీఆర్‌ కిట్లు, 350 బస్తీ దవాఖానలు, 50వేల మందికి అన్నపూర్ణ క్యాంటిన్ల ద్వారా రూ.5కే కడుపునిండా భోజనం, అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్లు.. ఒక్కటేమిటి 67 వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. మాట ఇచ్చాం.. దాన్ని నిలబెట్టుకున్నాం. ఇప్పుడు జీహెచ్‌ఎంసీలోని ప్రతి డివిజన్‌లో మనం కచ్చితంగా గెలువాలి. ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలి. అందరినీ సమన్వయంచేసుకొని ముందుకువెళ్లండి.మనకు సమయం తక్కువున్నది. ప్రతి నిమిషం విలువైనదే. వెంటనే మీమీ అనుచరులతో రంగంలోకి దిగండి.

అసత్యాలతో బీజేపీ గోల్‌మాల్‌

దేశ రాజకీయాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఒక కొత్త ట్రెండ్‌ తెచ్చింది. ఒక అబద్ధ్దాన్ని వందసార్లు చెప్పి ప్రజలను గోల్‌మాల్‌చేసే రాజకీయాలకు బీజేపీ కేరాఫ్‌గా మారింది. తాము ఏమీ చేయకున్నా ఏదో చేసినట్టు సోషల్‌ మీడియాలో యాంటీసోషల్‌ ప్రచారం చేసుకోవడం బీజేపీకే చెల్లింది. దేశంలో బీజేపీ చేసిన ఒక్క మంచిపని ఏదైనా ఉంటే ఎవరైనా చెప్పగలరా? దుమ్ముదుమ్ము ప్రచారం చేయడంతప్ప వాస్తవంగా వాళ్లు చేసిందేమిటో చెప్పే పరిస్థితిలేదు. ప్రజల మనోభావాలతో ఆడుకోవడం, విద్వేషాలను రెచ్చగొట్టి తాత్కాలికంగా రాజకీయ పబ్బం గడపడం వాళ్లకే చెల్లింది. ప్రజలకోసం పనిచేస్తున్న వారిపై నిందలు మోపుతున్నది. అభూత కల్పనలతో ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొడుతున్నది. దీనికి వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం వచ్చింది. ప్రజలను చైతన్యపరిచి బీజేపీ, మోదీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై టీఆర్‌ఎస్‌  పోరాటం చేస్తుంది.

నవరత్న కంపెనీలన్నీ అమ్మకానికి పెట్టిండు

రైల్వేలు, జీవితబీమాతోపాటు విద్యుత్‌ సంస్థలైన ఎన్టీపీసీ, బీహెచ్‌ఈఎల్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌, డిఫెన్స్‌, బీపీసీఎల్‌ వంటి నవరత్నాలుగాచెప్పే ప్రతిష్ఠాత్మకమైన ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించుకోవడం ద్వారా వాటిని కార్పొరేట్‌ సంస్థలకు మోదీ ప్రభుత్వం అప్పగిస్తున్నది. ఈ ఏడాది బడ్జెట్లో లక్ష కోట్ల రూపాయలను కేవలం ప్రభుత్వ రంగసంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించుకోవడం ద్వారా సమకూర్చుకోవాలని నిర్ణయించింది. ఈ సంస్థల్లో పనిచేసే లక్షలమంది ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. వారికి అండగా నిలువాలని టీఆర్‌ఎస్‌ నిర్ణయించింది.

ఇక మౌనం వద్దు.. పోరాటం చేద్దాం

త్వరలోనే జాతీయస్థాయి సదస్సును హైదరాబాద్‌లో నిర్వహిస్తాం. దీనికి సంబంధించి మాతో దేశంలోని అనేక ప్రతిపక్ష పార్టీలు టచ్‌లో ఉన్నాయి. సీపీఐ, సీపీఎం సహా పలుపార్టీల నేతలు  మాతో మాట్లాడుతున్నారు. మౌనపాత్ర పోషించడం రాజకీయపక్షాలకు, ప్రజలకు మంచిది కాదు. ఇక గళమెత్తాల్సిందే. రైల్వే, బీహెచ్‌ఈఎల్‌, ఎన్టీపీసీ, ఎల్‌ఐసీ, బీఎస్‌ఎన్‌ఎల్‌, బీపీసీఎల్‌ తదితర సంస్థలకు చెందిన నేతలు, అధికారులు మాతో మాట్లాడుతున్నారు.  ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు, కార్మికుల యుద్ధ్దానికి కేసీఆర్‌ ముందుంటాడని, మీతో నడుస్తానని వాళ్లతో చెప్పిన. అతి త్వరలోనే దీన్ని మొదలుపెడ్తాం. డిసెంబర్‌ రెండోవారంలో జరిగే కాన్‌క్లేవ్‌తోనే మొదలుపెడ్తాం. కేంద్రాన్ని నిలదీస్తాం. మోదీ ప్రభుత్వం ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేయాలన్నది. కానీ, మేం కాపాడుకున్నాం. వాళ్లకు కరోనా సమయంలో ఇవ్వలేకపోయిన రెండునెలల జీతాలను  చెల్లించాం. 120 కోట్లు ఆర్టీసీకి ఇచ్చాం.

డిజిన్వెస్ట్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌ను పెట్టిందే బీజేపీ

‘తొలి ప్రధాని నెహ్రూ ఎంతో దూరదృష్టితో ప్రభుత్వ రంగ సంస్థలను నెలకొల్పారు. వీటివల్ల ప్రజలకు ఎంతో మేలు కలుగుతున్నది. కానీ బీజేపీ సర్కారు.. ఆ సంస్థలను నిర్వీర్యంచేసి, పెట్టుబడులను ఉప సంహరించుకొని, ప్రైవేట్‌-కార్పొరేట్‌ కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నది. వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు పెట్టుబడుల ఉపసంహరణ (డిజిన్వెస్ట్‌మెంట్‌) అనే ముసుగులో ప్రభుత్వరంగ సంస్థలను ఖతం పట్టించే పని మొదలైంది. పెట్టుబడుల ఉపసంహరణ కోసం ఏకంగా ఓ మంత్రిత్వశాఖనే పెట్టారు. మొదటిసారిగా వాజ్‌పేయి ప్రభుత్వం ఏడు ప్రభుత్వరంగ సంస్థలలో పెట్టుబడులు ఉపసంహరించుకొన్నది. తర్వాత వచ్చిన మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వం మూడు సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించి, బీజేపీ విధానాలను కొనసాగించింది.

మోదీ ప్రభుత్వం ఏకంగా 23 సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించింది. వాటిని ప్రైవేట్‌, కార్పొరేట్‌ కంపెనీలకు అప్పగిస్తున్నది. మోదీ ప్రభుత్వం కొత్తగా ఒక్కటంటే ఒక్క ప్రభుత్వరంగ సంస్థను ప్రారంభించకపోగా ఉన్న వాటిని మూసివేసే ప్రయత్నం చేస్తున్నది. దీనివల్ల అటు దేశానికి, ఇటు ప్రజలకు, మరోవైపు లక్షల మంది ఉద్యోగులకు అన్యాయం జరుగుతున్నది. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేస్తున్నారంటే, ప్రైవేట్‌పరం చేస్తున్నారంటే అర్థంచేసుకోవచ్చు. కానీ లాభాల్లో నడుస్తూ ప్రజలకు సేవలు, ప్రభుత్వాలకు నిధులు అందిస్తున్న ప్రభుత్వరంగ సంస్థలను మూసివేస్తున్నారంటే ఏమని అర్థం చేసుకోవాలి? భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద రైల్వే వ్యవస్థ, 65 వేల కిలోమీటర్ల నెట్‌వర్క్‌ భారతీయ రైల్వేలకు ఉన్నది.

కరోనా సమయంలో కూడా రైల్వేలు సేవలందించాయి. అలాంటి రైల్వేలను ప్రైవేట్‌పరంచేసే అవసరం ఏమొచ్చింది? రైల్వేస్టేషన్‌లో చాయ్‌ అమ్మిన అని చెప్పిన మోదీ ఇప్పుడు రైల్వే స్టేషన్లనే తెగనమ్ముతున్నాడు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దేశానికే గర్వ కారణమైన సంస్థల్లో భారత జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) ఒకటి. ప్రపంచంలోనే అతి పెద్ద ఇన్సూరెన్స్‌ కంపెనీ. 40 కోట్ల మంది పాలసీ దారులు, 30 లక్షల కోట్ల ఆస్తి కలిగిన సంస్థ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైనప్పుడు నిధులు కూడా సమకూరుస్తున్నది. 2020-21 కేంద్ర బడ్జెట్‌లో ఎల్‌ఐసీ డివిడెండ్‌ రూ. 2,600 కోట్లుగా చూపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బీమా పథకాన్ని ఎల్‌ఐసీ గొప్పగా అమలుచేస్తున్నది. ఇంతటి ప్రాముఖ్యం, ఆవశ్యకత ఉన్న ఎల్‌ఐసీని ప్రైవేట్‌పరంచేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎల్‌ఐసీ లాభాలుగడిస్తే అది దేశానికి ఉపయోగపడుతుంది. కానీ విదేశీ కంపెనీలు లాభాలు గడిస్తే దేశానికి ఏం లాభం? ఆ కంపెనీలు తమ లాభాలను ఎక్కడికి తరలిస్తాయో కూడా తెలియదు.

 

content source from :*ntnews.com*