హైదరాబాద్ : కాళేశ్వరం పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్ తొలుత సతీసమేతంగా కాళేశ్వర ముక్తేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు సీఎం కేసీఆర్ దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి సీఎం దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు దగ్గరుండి సీఎం దంపతులతో స్వామివారికి అభిషేకం చేయించి, ఆశీర్వచనాలు ఇచ్చి తీర్థప్రసాదాలు అందజేశారు.
సీఎం పర్యటన నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ దర్శనం తరువాత మధ్యాహ్నం సీఎం కేసీఆర్ హెలికాప్టర్‌లో కాళేశ్వరం రిజర్వాయర్‌ను పరిశీలించనున్నారు. అటు తరువాత లక్ష్మీ బరాజ్‌కు చేరుకొని అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. యాసంగికి సాగునీటి విడుదల తదితర అంశాలపై అధికారులతో ఆయన మాట్లాడనున్నారు.