హైదరాబాద్ సేఫ్

న్యూయార్క్‌, లాస్‌ ఏంజిల్స్‌, లండన్‌, పారిస్‌ వంటి నగరాల కంటే కూడా హైదరాబాదే సురక్షితమని తేలింది. అభివృద్ధి చెందిన దేశాల్లోని ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో శాంతిభద్రతలు అద్భుతమని హైదరాబాద్‌ పోలీసుల వార్షిక నివేదిక తేల్చింది. ఆయా నగరాల్లో నమోదవుతున్న నేరాలు, సేఫ్టీకి సంబంధించి నివేదికను సోమవారం విడుదలచేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏటేటా నేరాలు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ ఏడాది 10 శాతం నేరాలు తగ్గగా.. ఇది గత ఏడాది 3 శాతంగా నమోదైంది. చైన్‌ స్నాచింగ్‌లు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. గత ఏడాది 13 కేసులు నమోదుకాగా, ఈ ఏడాది 5 మాత్రమే నమోదయ్యాయి. ఇంటర్నెట్‌ వినియోగం, వర్క్‌ఫ్రమ్‌ హోం, డిజిటల్‌ క్లాస్‌లు, డిజిటల్‌ ఆర్థిక లావాదేవీల్లో పెరుగదల కారణంగా సైబర్‌ నేరాలు అధికమయ్యాయి. సీసీఎస్‌ ఆధీనంలోని సైబర్‌క్రైమ్‌ పోలీస్‌స్టేషన్‌లో గత ఏడాది 1,393 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 2,314 కేసులు నమోదయ్యాయి. 12 రాష్ర్టాలకు చెందిన 259 మంది సైబర్‌ నేరగాళ్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మహిళా పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన కేసుల సంఖ్య గత ఏడాది 924 నమోదు కాగా, ఈ ఏడాది 673కి తగ్గింది. సీసీఎస్‌లో నమోదయ్యే వైట్‌కాలర్‌ నేరాలు గత ఏడాది 279 నమోదు కాగా, ఈ ఏడాది 173కి తగ్గాయి. సీసీ కెమెరాల ఏర్పాటులో దేశంలోనే హైదరాబాద్‌ మొదటిస్థానంలో నిలిచింది. ఈ ఏడాది కరోనా, వరదలతో విపత్కర పరిస్థితులు ఎదురయ్యాయని నివేదికలో పోలీసులు పేర్కొన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో పోలీసు సిబ్బంది నిరంతరం ప్రజాసేవలో ఉన్నారని తెలిపారు. కరోనా వారియర్స్‌గా ఉన్న సిబ్బందిలో 3 వేల మందికిపైగా కరోనా బారినపడ్డారని, 34 మంది మృతిచెందారని వెల్లడించారు.

అడుగడుగునా సీసీ కెమెరాలు..

చైన్‌స్నాచింగ్‌లు జరుగకుండా నిఘా.. రోడ్డు ప్రమాదాల నివారణకు పక్కాగా చర్యలు.. మహిళల రక్షణ కోసం వెనువెంటనే కదిలే షీటీమ్‌లు.. వెరసి గత ఏడాది కంటే హైదరాబాద్‌లో 10 శాతం నేరాలు తగ్గాయి. అమెరికా, ఇంగ్లాండ్‌లోని నగరాలకంటే కూడా హైదరాబాదే సురక్షితమని పోలీసు నివేదిక తేల్చింది.

హైదరాబాద్‌ పోలీసుల వార్షిక నివేదిక వివరాలు

  • గత ఏడాది హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో కేసులు: 25,187
  • ప్రస్తుత ఏడాది హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో కేసులు: 22,641
  • న్యూయార్క్‌ సిటీలో ఏటాజరిగే హత్యలు: 290 నుంచి 310
  • హైదరాబాద్‌లో గత ఏడాది జరిగిన హత్యలు: 84
  • ఈ ఏడాది జరిగినవి: 64
  • మహిళలపై నేరాల్లో తగ్గుదల: 19%
  • ఈ ఏడాది షీ టీమ్స్‌కు ఫిర్యాదులు:  970
  • vహైదరాబాద్‌లో గత ఏడాది రోడ్డు ప్రమాదాల్లో మరణాలు: 271
  • ఈ ఏడాది రోడ్డు ప్రమాదాల్లో మరణాలు: 237