గ్రేటర్ ఎన్నికల్లో పోటీకీ అర్హులెవరు?

గ‌్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌కు న‌గారా మోగిన విష‌యం తెలిసిందే. డిసెంబ‌ర్ 1వ తేదీన గ్రేట‌ర్ ఎన్నిక‌ల‌కు పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఈ నెల 20వ తేదీ వ‌ర‌కు నామినేష‌న్ల‌ను స్వీక‌రించ‌నున్నారు. మ‌రి ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు ఎవ‌రు అర్హులు అనే విష‌యంపై స్ప‌ష్ట‌త అవ‌స‌రం.. ఈ మేర‌కు రాష్ర్ట ఎన్నిక‌ల సంఘం నిబంధ‌న‌ల‌ను విడుద‌ల చేసింది.

-జూన్‌1, 1994కు ముందు ముగ్గురు సంతానం ఉన్నవారు అర్హులు

-రేషన్‌ డీలర్లకు ఓకే.. అంగన్‌వాడీలకు నో చాన్స్‌!

-జూన్‌1, 1994కి ముందు ముగ్గురు, అనంతరం మే 31, 1995 వరకు మరో ఇద్దరు సంతానం కలిగినవారు కూడా పోటీకి అర్హులు

-జూన్‌ 1, 1994కి ముందు ముగ్గురు, మే 31, 1995 వరకు మరొకరు, ఆ తరువాత మరొక సంతానం కలిగినవారు పోటీకి అనర్హులు

-మే 31,1995నాటికి ఒక సంతానం ఉండి, అనంతరం రెండో కాన్పులో కవలలు జన్మిస్తే వారు పోటీకి అర్హులు. కవలలు కాకుండా ఇద్దరు సంతానం కలిగితే అనర్హులు.

-మే 31, 1995 తర్వాత ఒకే కాన్పులో ముగ్గురు సంతానం కలిగినవారు అర్హులు

-ఒక వ్యక్తి తన మొదటి భార్యద్వారా ఇద్దరు సంతానం కలిగి, ఆమె చనిపోయిన తరువాత రెండో భార్య ద్వారా ఒక సంతానం కలిగితే అతను పోటీకి అనర్హుడు. అయితే, అతని భార్యకు ఒకే సంతానం అయినందున ఆమె పోటీ చేయవచ్చు.

-అభ్యర్థికి ముగ్గురు పిల్లలు ఉన్నప్పటికీ నామినేషన్ల పరిశీలన నాటికి అందులో ఒకరు చనిపోతే అతనికి పోటీకి అర్హత లభిస్తుంది.

-నామినేషన్ల పరిశీలన నాటికి ఇద్దరు పిల్లలు ఉండి గర్భవతి అయినప్పటికీ తను పోటీకి అర్హురాలే.

-కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పోటీకి అనర్హులు. ఒకవేళ ఉద్యోగానికి రాజీనామాచేసి,  అది అధీకృత అధికారి చేత నామినేషన్ల పరిశీలన నాటికి ఆమోదించబడితేనే అర్హత ఉంటుంది.

-సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రేషన్‌ షాపు డీలర్లు పోటీకి అర్హులు

-హైకోర్టు తీర్పు ప్రకారం అంగన్‌వాడీ కార్యకర్తలు పోటీకి అనర్హులు

-నామినేషన్‌తోపాటు చెక్‌లిస్టులోనిపత్రాలు సమర్పించని పక్షంలో పరిశీలనరోజున దాన్ని తిరస్కరిస్తారు.

-ఒక అభ్యర్థికి ప్రతిపాదకుడిగా ఉన్న వ్యక్తి అదే డివిజన్‌ నుంచి పోటీ చేయవచ్చు.

-మతిస్థిమితం లేని వారు పోటీకి అనర్హులు.ఫిర్యాదుదారు చట్ట ప్రకారం దానిని నిరూపించాలి.