వాషింగ్టన్: అమెరికా క్యాపిటల్ హిల్ బిల్డింగ్‌లో జరిగిన హింసలో నలుగురు మృతిచెందారు. ఈ ఘటనలో అధికారులు 52 మందిని అరెస్టు చేశారు. బైడెన్ విజయాన్ని ఖారారు చేసేందుకు జరుగుతున్న సమావేశాలను అడ్డుకునేందుకు ట్రంప్ మద్దతుదారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ట్రంప్ అభిమానులంతా క్యాపిటల్ హిల్‌ను అటాక్ చేశారు. ఆ సమయంలో జరిగిన హింసలో క్యాపిటల్ గ్రౌండ్‌లోనే సుమారు 26 మందిని అదుపులోకి తీసుకున్నారు. లైసెన్సు లేని .. నిషేధిత ఆయుధాలు కలిగి ఉన్న వారిని కూడా అరెస్టు చేశారు. రిపబ్లికన్, డెమోక్రటిక్ నేషనల్ కమిటీ హెడ్‌క్వార్టర్ల వద్ద రెండు పైప్ బాంబులను స్వాధీనం చేసుకున్నారు. క్యాపిటల్ పోలీసు ఆఫీసర్ జరిపిన ఫైరింగ్‌లో ఓ మహిళ మృతిచెందింది. మరో ముగ్గురు మెడికల్ ఎమర్జెన్సీ కారణాల వల్ల మృతిచెందారు. క్యాపిటల్ అటాక్ ఘటనలో మొత్తం 14 మంది పోలీసులు గాయపడ్డారు. ఇద్దరు పోలీసులు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. క్యాపిటల్ హిల్ ఘటనలో అరెస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ట్రంప్ అభిమానుల్ని తరిమేందుకు ఫెడరల్ ఏజెంట్లు స్మోక్ క్యానిస్టర్లను వాడారు. ఫ్లాష్‌బ్యాంగ్ గ్రేనేడ్లు, రబ్బర్ బుల్లెట్లతో వెళ్లగొట్టే ప్రయత్నం చేశారు. ట్రంప్ అభిమానులు ఎలా క్యాపిటల్ హిల్‌లోకి వచ్చారు, ఎలా వాళ్లంతా బయటకు స్వేచ్ఛగా వెళ్లిపోయార్న అంశంలో స్థానిక పోలీసులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హింసకు దిగిన వారిని గుర్తించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. సోషల్ మీడియాల్లో పోస్టు అయిన వీడియోలు, ఫోటోల ఆధారంగా నిందితులను గుర్తించే పనిలోపడ్డారు. 15 రోజుల పాటు పబ్లిక్ ఎమర్జెన్సీ ప్రకటించారు. నగరంలో ప్రజల కదలికలపై నిఘా పెట్టనున్నారు.