బ్యాడ్మింటన్‌ మాజీ క్రీడాకారుడి కిడ్నాప్‌ కేసులో ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ అరెస్ట్‌

మాజీ మంత్రి భూమా అఖిల‌ప్రియ భ‌ర్త భార్గ‌వ‌రామ్ దుస్సాహ‌సానికి పాల్ప‌డ్డార‌ని స‌మాచారం. ఏకంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌మీప బంధువుల కిడ్నాప్‌న‌కు పాల్ప‌డ్డార‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం. భూమికి సంబంధించి వ్య‌వ‌హార‌మే కిడ్నాప్‌న‌కు కార‌ణ‌మ‌ని తెలుస్తోంది.తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్‌లోని బోయిన్‌ప‌ల్లిలోని మ‌నో వికాస్‌న‌గ‌ర్‌లో నిన్న రాత్రి ముఖ్య‌మంత్రి స‌మీప బంధు వులైన మాజీ క్రీడాకారుడు ప్ర‌వీణ్‌రావు (51)తో పాటు ఆయ‌న త‌మ్ముళ్లైన సునీల్‌రావు (49), న‌వీన్‌రావు (47)ల‌ను అఖి లప్రియ భ‌ర్త భార్గ‌వ్‌రామ్ అనుచ‌రులు కిడ్నాప్‌న‌కు పాల్ప‌డ్డార‌ని బాధిత బంధువులు ఆరోపిస్తున్నారు. ఐటీ అధికారుల మంటూ ఇంటి లోప‌లికి వెళ్లిన దుండ‌గ‌లు, అనంత‌రం మూడు వాహ‌నాల్లో వారి కిడ్నాప్‌న‌కు పాల్ప‌డిన‌ట్టు కుటుంబ స‌భ్యులు చెబుతున్నారు. ల్యాండ్ సెటిల్‌మెంట్‌కు సంబంధించిన వివాద‌మే కిడ్నాప్‌న‌కు దారి తీసిన‌ట్టు తెలుస్తోంది. కిడ్నాప్‌న‌కు గురైన వారి తండ్రి కృష్ణారావు న‌గ‌రంలో ప్ర‌ముఖ లాయ‌ర్‌. గ‌తంలో భూమా నాగిరెడ్డికి ఆయ‌న లాయ‌ర్‌గా వ్య‌వ‌హ‌రించేవారు. భూసంబంధ వివాదాల‌ను ఆయ‌నే చూసేవార‌ని తెలుస్తోంది. ఈ సంద‌ర్భంగా కొన్ని భూముల కొనుగోళ్ల‌లో కృష్ణారావు కుటుంబం భూమా నాగిరెడ్డితో భాగ‌స్వామ్యం ఉన్న‌ట్టు తెలుస్తోంది.భూమి నాగిరెడ్డి మ‌ర‌ణానంత‌రం ఆయ‌న ఆప్త‌మిత్రుడు ఏవీ సుబ్బారెడ్డితో కృష్ణారావు కుటుంబం సఖ్య‌త‌గా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇది భూమా నాగిరెడ్డి కుమార్తె అఖిల‌ప్రియ‌, ఆమె భ‌ర్త భార్గ‌వ్‌రామ్‌కు గిట్ట‌లేద‌ని తెలుస్తోంది. త‌మ భూములు కృష్ణారావు కుటుంబ స‌భ్యుల పేర్ల‌తో త‌మ తండ్రి రాయించాడ‌ని, వాటిని త‌మ‌కు రాయించాల‌ని అఖిల‌ప్రియ, ఆమె భ‌ర్త గ‌త కొంత కాలంగా డిమాండ్ చేస్తున్న‌ట్టు స‌మాచారం. కానీ భూమా నాగిరెడ్డికి ఎలాంటి సంబంధం లేద‌ని, అవి త‌మ సొంత ప్రాప‌ర్టీ అని కృష్ణారావు కుటుంబ స‌భ్యుల వాద‌న‌గా ఉన్న‌ట్టు స‌మాచారం.నిజానికి  కృష్ణారావు అల్లుడు, లాయ‌ర్‌ హ‌రీష్‌రావు భూముల వ్య‌వ‌హారంలో కీల‌క‌మ‌ని తెలుస్తోంది. ప్ర‌ధానంగా హ‌రీష్‌రావును కిడ్నాప్ చేయాల‌ని భావించిన‌ట్టు తెలిసింది. అయితే స‌మ‌యానికి ఇంట్లో ఉన్న కృష్ణారావు కుమారుల కిడ్నాప్‌న‌కు పాల్ప‌డ్డా ర‌ని కుటుంబ స‌భ్యులు చెబుతున్నారు. కృష్ణారావు కుమారుల ఇళ్ల నుంచి ల్యాప్‌టాప్‌, సెల్‌ఫోన్ల‌ను కూడా కిడ్నాప‌ర్లు తీసుకెళ్లారని స‌మాచారం. పోతూపోతూ వాచ్‌మ‌న్‌పై కూడా దాడికి పాల్ప‌డ్డారు. కిడ్నాప్ స‌మాచారం తెలిసిన వెంట‌నే నార్త్‌జోన్ డీసీపీ క‌ల్మేశ్వ‌ర్‌, సెంట్ర‌ల్ జోన్ డీసీపీ సంఘ‌ట‌నా స్థ‌లానికి వెళ్లారు. అలాగే మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ కవిత అక్కడకు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీఎం బంధువుల కిడ్నాప్‌న‌కు పాల్ప‌డ్డాన్ని తెలంగాణ ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా తీసుకుంది. సీసీ కెమెరాల ఆధారంగా రెండు అనుమానిత వాహ‌నాల‌ను గుర్తించిన‌ట్టు తెలుస్తోంది.

కిడ్నాప్‌ కేసులో ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ అరెస్ట్‌

బ్యాడ్మింటన్‌ మాజీ క్రీడాకారుడు ప్రవీణ్ రావు‌ కిడ్నాప్‌ కేసులో ఏపీకి చెందిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియతోపాటు ఆమె భర్త భార్గవరామ్‌ను పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ప్ర‌వీణ్‌తో పాటు సునీల్‌, న‌వీన్‌ను కిడ్నాప్‌ చేశారని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అత‌ని కుటుంబ స‌భ్యులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రంగంలోకి దిగి కిడ్నాప‌ర్ల నుంచి ప్ర‌వీణ్ రావుతో పాటు అత‌ని సోద‌రుల‌ను కాపాడారు.

హఫీజ్‌పేటలో ఉన్న భూమికి సంబంధించి ప్రవీణ్‌రావు కుటుంబానికి, అఖిలప్రియ కుటుంబానికి వివాదాలు నడుస్తున్నట్లుగా స‌మాచారం. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి కొంతమంది వ్యక్తులు ఐటీ అధికారుల‌మంటూ ప్రవీణ్‌రావు ఇంట్లోకి ప్రవేశించారు.

వారిని ప్రశ్నించాలంటూ ప్రవీణ్‌తో పాటు అతని సోదరులు సునీల్‌, నవీన్‌ను వాహనంలో తీసుకువెళ్లారు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ప్ర‌వీణ్‌ను అపహరించారంటూ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాలింపులు చేపట్టారు. సీసీకెమెరాలను పరిశీలించి వారిని తీసుకెళ్లిన వాహనాన్ని గుర్తించారు. ఈ క్రమంలో సదరు వ్యక్తులు ప్రవీణ్‌తో పాటు అతని సోదరులను నార్సింగి వద్ద వదిలిపెట్టి పరారయ్యారు. మోయినాబాద్‌ వైపు కిడ్నాప‌ర్లు పారిపోతుండగా వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా.. అఖిలప్రియ, భార్గవరామ్‌ పేర్లు వెలుగులోకి వచ్చాయి. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.