రాష్ట్రoలో ఫియట్ భారీ పెట్టుబడులు

హైద‌రాబాద్ : రాష్ట్రానికి పెట్టుబ‌డుల ప్ర‌వాహం కొన‌సాగుతూనే ఉంది. తెలంగాణ వ్యాప్తంగా ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతి గాంచిన అమెజాన్, గూగుల్, ఫేస్‌బుక్, ఆపిల్ వంటి సంస్థ‌లు పెట్టుబ‌డులు పెట్ట‌గా ఆ జాబితాలో వాటి స‌ర‌స‌న ఫియ‌ట్ క్రిస్ల‌ర్ సంస్థ కూడా చేరేందుకు సిద్ధ‌మైంది. మేటి జీప్ కార్ల‌కు సంబంధించిన ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతిగాంచిన ఆటోమొబైల్ సంస్థ ఫియట్ క్రిస్లర్ తెలంగాణ‌లో పెట్టుబ‌డులు పెట్టేందుకు సిద్ధ‌మైన‌ట్లు ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఫియ‌ట్ సంస్థ హైద‌రాబాద్‌లో టెక్నాల‌జీ సెంట‌ర్‌ను ఏర్పాటు చేయ‌నుంది. దీంట్లో భాగంగా ఆ సంస్థ‌ రూ. 15 కోట్ల డాల‌ర్ల పెట్టుబ‌డులు(సుమారు రూ. 1100 కోట్లు) పెట్ట‌నుంది. ఈ టెక్నాల‌జీ సెంట‌ర్ ఏర్పాటుతో స్థానిక యువ‌త‌కు మెండుగా ఉపాధి అవ‌కాశాలు ల‌భించ‌నున్నాయ‌ని కేటీఆర్ పేర్కొన్నారు. భ‌విష్య‌త్‌కు కావాల్సిన ఆటో మొబైల్ రంగానికి హైద‌రాబాద్ కేంద్రం కానున్న‌ట్లు కేటీఆర్ తెలిపారు.